చైనాతో ఇండియాకు మరో తలనొప్పి.. అరుణాచల్ బార్డర్లో వైమానిక స్థావరాల నిర్మాణం పూర్తి.. చైనా ప్లానేంటి..?

చైనాతో ఇండియాకు మరో తలనొప్పి.. అరుణాచల్ బార్డర్లో వైమానిక స్థావరాల నిర్మాణం పూర్తి..  చైనా ప్లానేంటి..?

ఇండియాకు చైనాతో పక్కలో బల్లెంలా తయారైంది పరిస్థితి. ఇన్నాళ్లుగా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో ఏదో ఒక వివాదాన్ని క్రియేట్ చేస్తూ రెచ్చగొడుతూ వస్తున్న చైనా.. ఇప్పుడు కూతవేటు దూరంలో ఎయిర్ క్రాఫ్ట్ షెల్టర్ ను పూర్తి చేసింది.  మెక్ మోహన్ రేఖకు (ఇండియా - చైనా బార్డర్) 40 కిలోమీటర్ల దూరంలో.. టిబెట్ లో లుంజ్ ఎయిర్ బేస్ సమీపంలో 36 హార్డెన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ బ్లాక్స్ నిర్మించింది. 

ఈ షెల్టర్స్ అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ టౌన్ నుంచి 107 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ స్థావరాల ఏర్పాటుతో చైనాకు ఇండియాపై యాక్షన్ ప్లాన్ కు దిగేందుకు కావాల్సిన సమయం చాలా తగ్గింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చర్యలకు వెంటనే స్పందించేందుకు వీలు కలుగుతుందని అంటున్నారు. దీంతో అరుణాచల్, అస్సాం బార్డర్లలో ఉన్న ఎయిర్ బేస్ లకు ప్రమాదమని ఇండియా భావిస్తోంది. 

భవిష్యత్తులో చిన్న సమస్య వచ్చినా చైనా ఎయిర్ క్రాఫ్ట్స్, డ్రోన్స్, ఫైటర్ జెట్స్ ను ఈ స్థావరాలలో దింపుతుందని.. మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్ కార్యాచరణ కోసం మందు సామాగ్రి, ఫుయెల్ ను అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టినట్లు చెప్పారు. 

డోక్లాం ఘటన జరిగినప్పుడే 2017లోనే సైన్యాన్ని హెచ్చరించినట్లు ఆయన చెప్పారు. టిబెట్ లో యుద్ధవిమానాల స్థావరాన్ని నిర్మిస్తున్నారంటేనే.. భవిష్యత్తులో ఇండియాతో యుద్ధానికి సిద్ధమవుతున్నారని ముందుగానే ఊహించినట్లు ఆయన తెలిపారు. 

చైనా భవిష్యత్తు యుద్ధ ప్రణాళికలకు ఈ వైమానిక స్థావరాలు ఉపయోగపడతాయని.. అందులో భాగంగానే చైనా వీటిని నిర్మించిందని ఎయిర్ మార్షల్ అనిల్ ఖోస్లా అన్నారు. 2020 గాల్వాన్ ఘటన తర్వాత చైనా బార్డర్ లో మిలిటరీని, వైమానిక స్థావరాలను పెంచుకుంటూ వస్తోందని అన్నారు.