19 గంటలు వృథా.. లోక్ సభ సభ్యులపై స్పీకర్ ఓం బిర్లా అసహనం

19 గంటలు వృథా.. లోక్ సభ సభ్యులపై స్పీకర్ ఓం బిర్లా అసహనం

న్యూఢిల్లీ: లోక్ సభ బడ్జెట్  సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్పీకర్  పోడియం వద్దకు దూసుకెళ్లారు. శాంతించాలని, కార్యకలాపాలు జరిగేందుకు సహకరించాలని స్పీకర్  ఓం బిర్లా ఎంతగా విజ్ఞప్తి చేసినా సభ్యులు వినలేదు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్  వాయిదా వేశారు. 

సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్ష ఎంపీలు అలాగే నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉండిపోయారు. స్పీకర్  ఎంతగా నచ్చచెప్పేందుకు యత్నించినా లాభం లేకపోయింది. దీంతో సభను స్పీకర్  సోమవారానికి వాయిదా వేశారు. కాగా.. శుక్రవారం నాటి అజెండాలో బడ్జెట్ పై సభలో చర్చ జరగాల్సి ఉంది. దానితో పాటు పలు బిల్లులు,  హెల్త్ కేర్, విద్య, ఏఐ, డిజిటల్  ప్లాట్ ఫామ్స్, కార్మిక సంస్కరణలపైనా చర్చ జరగాల్సి ఉంది. 

కానీ, ప్రతిపక్ష సభ్యులు అలాగే నినాదాలు చేస్తూ ఉండిపోవడంతో సభను స్పీకర్  వాయిదా వేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 19 గంటల విలువైన సభ సమయాన్ని వేస్ట్  చేశారని మండిపడ్డారు.

పార్లమెంట్ కాంప్లెక్స్ లో కాంగ్రెస్  ఎంపీల ధర్నా

అమెరికాతో ట్రేడ్ డీల్, మాజీ ఆర్మీ చీఫ్  ఎంఎం నరవణె పుస్తక వివాదం, 8 మంది ఎంపీల సస్పెన్షన్​పై కాంగ్రెస్  ఎంపీలు పార్లమెంట్  కాంప్లెక్స్​లో ధర్నా చేశారు. మకర్ ద్వార్  వద్ద ఎంపీలు సమావేశమై కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీతో పాటు సస్పెన్షన్​కు గురైన ఎంపీలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. అమెరికాతో జరిగింది ట్రేడ్ డీల్  కాదని, అది ట్రాప్  డీల్  అని మండిపడ్డారు.