అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలు ఇంకా పగటి కలలు కంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. బీఆర్ఎస్ నేతలు ఇంకా దొర పోకడలతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని బీఆర్ఎస్ నేతలు ఇల్లు, బడి, కమ్యూనిటీ హాల్ కట్టిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. జిల్లాలో మంత్రి , ఎమ్మెల్యే , ఎంపీ, సీఎం అందరూ కాంగ్రెస్ వాళ్లేనని చెప్పారు. 10 ఏళ్ల అధికారంలో ఎలగబెట్టనోళ్లు ఇప్పుడు సొల్లు పురాణం చెబుతున్నారని మండిపడ్డారు. మాయ మాటలు చెప్పడం తప్ప వాళ్ళు చేసిందేమి లేదన్నారు.
యుద్ధం చేసే వారికే కత్తి ఇవ్వాలన్నారు పొంగులేటి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులనే మున్సిపాలిటీ పోరులో గెలిపించాలన్నారు . అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి సొంతింటి కల నెరవేస్తున్నామని తెలిపారు. తొర్రూరులో ఇంటి స్థలాలను అర్హులైన పేదలకు పంపిణీ చేసే బాధ్యత రెవెన్యూ మంత్రిగా తాను తీసుకుంటున్నానని చెప్పారు.
మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 11న జరగనుండగా..13న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజులే సమయం ఉండటంతో నేతలు స్పీడ్ పెంచారు. ఉదయం నుంచే ర్యాలీలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు
