నిజామాబాద్ అర్బన్,వెలుగు : కార్పొరేషన్ఎన్నికల్లో విజయం సాధించి ఇందూరులో ట్రిపుల్ ఇంజిన్ సర్కారును ఏర్పాటు చేయబోతున్నామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం నగరంలోని పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించి మాట్లాడారు. పార్లమెంట్ సభ్యుడిగా అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యేగా తాను ఉన్నామని, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకుని ట్రిపుల్ ఇంజిన్ సర్కారును ఏర్పాటు చేస్తామన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థుల్లో చాలా మందికి అవినీతి మూలాలు ఉన్నాయని, వారికెవరికి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు.17 సంవత్సరాలుగా పన్ను కట్టకుండా ఎగ్గొట్టిన బడా వ్యాపారవేత్తను రాజకీయంలోకి తెచ్చారని, ఏమాత్రం అవగాహన లేని ఆయన సతీమణిని మేయర్ పీఠం మీద కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థులు నగర అభివృద్ది కోసం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతారని, ప్రజలు వారిని ఆదిరించాలని కోరారు.
