వెంటనే ఇరాన్ వదిలి వెళ్లండి.. తమ పౌరులకు అమెరికా హెచ్చరిక

వెంటనే ఇరాన్ వదిలి వెళ్లండి.. తమ పౌరులకు అమెరికా హెచ్చరిక
  • ఇరాన్ పై యూఎస్ అటాక్స్ పై కొనసాగుతున్న ఊహాగానాలు 

వాషింగ్టన్: ఇరాన్​లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికన్ పౌరులు వెంటనే ఆ దేశం విడిచి వెళ్లిపోవాలని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. అమెరికా ప్రభుత్వ సహాయం కోసం చూడకుండా సొంతంగా ఆ దేశం విడిచి వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవాలని ఈ మేరకు ఇరాన్ లోని వర్చువల్ యూఎస్ ఎంబసీ శుక్రవారం సూచించింది. ఇరాన్ అంతటా అల్లర్లు కొనసాగుతున్నాయని, ప్రయాణాలకు ఆటంకాలు ఎదురుకావచ్చు కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ‘‘ఇంటర్నెట్ సర్వీసుల బంద్ కంటిన్యూ కావచ్చు. కాబట్టి కమ్యూనికేషన్ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోండి. 

సురక్షితమని భావిస్తే భూమార్గం ద్వారానైనా ఇరాన్ ను దాటి తుర్కియేకు లేదా అమెరికాకు బయలుదేరండి. విమాన సర్వీసులు కూడా సడెన్ గా బంద్ కావచ్చు. కాబట్టి ఎయిర్ లైన్స్ కంపెనీలతో టచ్ లో ఉండండి. ఒకవేళ ఇరాన్ నుంచి బయటకు రాలేని పరిస్థితి ఎదురైతే.. ఉన్న చోటే సురక్షితమైన ప్రాంతంలో ఉండండి. ఫుడ్, వాటర్, మెడిసిన్ వంటివి ముందే సిద్ధం చేసుకోండి. వీధుల్లోకి వెళ్లొద్దు. ప్రదర్శనల్లో పాల్గొనొద్దు. చుట్టూ ఏం జరుగుతోందో నిరంతరం గమనిస్తూ ఉండండి. 

ఫోన్ ను ఎల్లప్పుడూ చార్జ్ పెట్టి ఉంచుకోండి. లోకల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉండండి. యూఎస్ ఇరానియన్ పౌరులు ఇరాన్ పాస్ పోర్టుతోనే దేశం దాటండి. ఎందుకంటే యూఎస్ పౌరసత్వాన్ని ఆ దేశం పరిగణనలోకి తీసుకోదు”అని తన పౌరులకు అమెరికన్ ఎంబసీ సూచించింది. కాగా, అమెరికా, ఇరాన్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొనడం.. ఇరాన్ పై అమెరికా దాడులు చేస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో తన పౌరులకు అమెరికా తాజాగా ఈ అడ్వైజరీ జారీ చేయడం గమనార్హం.  

ఇరాన్, యూఎస్​కు మధ్యవర్తిత్వం చేశాం: ఒమన్

ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం అంశంపై అమెరికా, ఇరాన్ దేశాలకు మధ్య తాము మధ్యవర్తిత్వం నెరిపామని ఒమన్ వెల్లడించింది. ఒమన్ విదేశాంగ శాఖ ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో, అమెరికా స్పెషల్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్, యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్​తో ఒమన్ ఫారిన్ మినిస్టర్ బదర్ అల్ బుసైదీ వేర్వేరుగా భేటీ అయ్యారని తెలిపింది. రెండు దేశాల మధ్య సాంకేతికపరమైన, దౌత్యపరమైన సంప్రదింపులను ప్రారంభించేందుకు వీలుగా ఈ మధ్యవర్తిత్వం చేసినట్టుగా పేర్కొంది.