మురళీధర్ గౌడ్ ‘వెంకట్రామయ్య గారి తాలూకా’.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సురేష్ బాబు

మురళీధర్ గౌడ్ ‘వెంకట్రామయ్య గారి తాలూకా’.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సురేష్ బాబు

సీనియర్ నటుడు మురళీధర్ గౌడ్, ప్రముఖ నటి సుధ ప్రధాన పాత్రల్లో నటించిన భావోద్వేగ ప్రధాన చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. ‘జయమ్మ పంచాయతీ’ ఫేమ్ దినేష్ కుమార్ ఈ చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

తండ్రి–పిల్లల మధ్య అనుబంధం, బాధ్యతలు, భావోద్వేగాల నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు సతీష్ ఆవాల తెరకెక్కిస్తున్నారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే అందమైన ప్రేమకథతో పాటు ఫాదర్ సెంటిమెంట్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

ఈ మూవీలో సీనియర్ దర్శకుడు, నటుడు యనమదల కాశీవిశ్వనాథ్, మిర్చి మాధవి, జబర్దస్త్ ఫేమ్ సత్యశ్రీ, మొగలిరేకులు సీరియల్ ఫేమ్ ఇక్బాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

తాజాగా ఈ చిత్ర టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఆవిష్కరించారు. టైటిల్ ఎంతో ఆసక్తికరంగా ఉందని, సినిమా కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలో ఈ మూవీ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నట్లు చిత్రబృందం తెలిపింది.