Ashes 2025-26: యాషెస్ తొలి టెస్టు.. స్టీవ్ స్మిత్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్సీ.. కమ్మిన్స్ స్థానంలో బోలాండ్

Ashes 2025-26: యాషెస్ తొలి టెస్టు.. స్టీవ్ స్మిత్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్సీ.. కమ్మిన్స్ స్థానంలో బోలాండ్

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగబోయే ప్రతిష్టాత్మకమైన యాషెస్ కు సమయం దగ్గర పడుతోంది. నవంబర్ 21 నుంచి జరగబోయే ఈ సమరానికి ఆస్ట్రేలియా వేదిక కానుంది. ఈ మెగా సిరీస్ కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ గాయం కారణంగా తొలి టెస్ట్ మ్యాచ్ కు దూరమయ్యాడు. వెన్ను నొప్పి నుంచి కోలుకుంటున్నందున కమ్మిన్స్ స్థానంలో స్టీవ్ స్మిత్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్సీ చేయనున్నాడు. పెర్త్ వేదికగా జరగబోయే తొలి టెస్టుకు కమ్మిన్స్ అందుబాటులో ఉండడం లేదని  క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం (అక్టోబర్ 27) ధృవీకరించింది.  

డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత వెస్టిండీస్ తో జరిగిన మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో కమ్మిన్స్ గాయపడ్డాడు. ఈ క్రమంలో ఇటీవలే టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్ కు కమ్మిన్స్ దూరమయ్యాడు. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తో 2023 వన్డే వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియాకు అందించిన కమ్మిన్స్ యాషెస్ తొలి టెస్టుకు అందుబాటులో లేకపోవడం ఆసీస్ కు మైనస్ గా మారింది. కమ్మిన్స్ స్థానంలో సూపర్ ఫామ్ లో ఉన్న స్కాట్ బోలాండ్ తొలి టెస్టులో ఆడడం కన్ఫర్మ్ అయింది. కమ్మిన్స్ తొలి టెస్టుకు మిస్ అయినా డిసెంబర్ 4న గబ్బాలో ప్రారంభమయ్యే డే-నైట్ టెస్ట్ లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

క్రికెట్ లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా యాషెస్ కు ఎక్కువ క్రేజ్ ఉందని భావిస్తారు. 1882లో తొలిసారి యాషెస్ సిరీస్‌ జరిగింది. ప్రతి రెండేళ్లకోసారి ఈ ప్రతిష్టాత్మక సిరీస్ వచ్చినప్పుడల్లా క్రికెట్‌ ప్రపంచంలో చర్చ జరుగుతూనే ఉంటుంది. నవంబర్ 21 నుంచి ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. సొంతగడ్డపై జరగబోయే ఈ టెస్ట్ సిరీస్ ను ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా ఉంది. మరోవైపు 2015 నుంచి యాషెస్ గెలవని ఇంగ్లాండ్ ఎలాగైనా ఆసీస్ కు షాక్ ఇవ్వాలని చూస్తోంది. 

చివరిసారిగా ఇంగ్లాండ్ లో జరిగిన యాషెస్ 2-2 తో సమమైంది. తొలి రెండు టెస్టులు ఆస్ట్రేలియా గెలిస్తే చివరి మూడు టెస్టుల్లో ఇంగ్లాండ్ రెండు టెస్టులు గెలిచింది. ఒక మ్యాచ్ డ్రా గా ముగిసింది. అంతకముందు 2021-22 యాషెస్ లో ఆస్ట్రేలియా 4-0తో గెలిచింది. ఆస్ట్రేలియా చివరి 15 స్వదేశీ టెస్టుల్లో రెండింటిలో మాత్రమే ఓడిపోయింది. ఓవరాల్ గా ఇప్పటి వరకూ చరిత్రలో మొత్తం 330 యాషెస్‌ టెస్ట్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 136 టెస్టులు, ఇంగ్లండ్‌ 108 టెస్టులు గెలవగా.. 91 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇటీవలే ఇండియాతో ఇంగ్లాండ్ 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-2 తో సమం చేసుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా వెస్టిండీస్ పై 3-0 తేడాతో గెలిచింది.