- గ్రామ సర్పంచ్ సూచనతో కాలువలోకి తోసి హత్య
- ముగ్గురు పిల్లల రూల్ తప్పించుకునేందుకు దుర్మార్గం
ఎడపల్లి, వెలుగు: సర్పంచ్‌గా పోటీ చేయాలంటే ముగ్గురు పిల్లల నిబంధన అడ్డువస్తుందని.. కన్నబిడ్డనే హత్య చేశాడో వ్యక్తి. తన గ్రామ సర్పంచ్ సలహతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. సోమవారం ఎడపల్లి పోలీసు స్టేషన్లో నిజామాబాద్ పోలీసు కమిషనర్సాయిచైతన్య మీడియాకు వివరాలను వెల్లడించారు. జనవరి 29న ఎడపల్లి మండలంలోని నిజాంసాగర్ కాల్వలో బాలిక మృతదేహం బయటపడింది. విచారణలో అది మహరాష్ట్ర లోని ముత్కేడ్ తాలూకా కెరూర్ గ్రామానికి చెందిన ప్రాచీ (8) డెడ్‌బాడీగా గుర్తించారు. ప్రాచీ తండ్రి కొండమంగలే పాండురంగ కెరూర్ లో సెలూన్ నిర్వహిస్తుంటాడు. అతనికి ఒక బాబు, ఇద్దరు కుమార్తెలున్నారు. మహరాష్ట్రలో త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో కెరూర్ సర్పంచ్ గా పోటీ చేయాలని పాండురంగ భావించాడు.
పోటీ గురించి ప్రస్తుత సర్పంచ్ షిండే గణేశ్‌ను సంప్రదించగా ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హులు అవుతారని, బాబును ఎవరికైనా దత్తత ఇవ్వాలని సలహా ఇచ్చాడు. అయితే దత్తత ఇచ్చినా ప్రత్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని అనుమానించిన పాండురంగ, గణేశ్.. ఫుణె మున్సిపల్‌కార్పొరేషన్ ఆఫీసు వెళ్లి బాబు బర్త్ సర్టిఫికెట్లో తండ్రి పేరు మార్చేందుకు పైరవీ చేశారు.
అది సాధ్యపడక పోవడంతో ముగ్గురిలో ఒకరిని చంపేసి తప్పిపోయినట్లు ప్రచారం చేయాలని గణేశ్ షిండే సలహా ఇచ్చాడు. దీంతో పాండురంగ పెద్ద కూతురు ప్రాచీకి మాయ మాటలు చెప్పి తన బైక్ పై నిజామాబాద్ జిల్లా ఎడపల్లి తీసుకొచ్చి.. ఇక్కడి డీ46/8 నిజాం సాగర్ కెనాల్ లో కుమార్తెను తోసివేసి చనిపోయినట్టు నిర్ధారించుకుని వెళ్లిపోయాడు. ప్రాచీ గురించి తల్లి ప్రశ్నిస్తే నిజామాబాద్‌లో బంధువుల ఇంట్లో ఉందని నమ్మించాడు. కాల్వలో బయటపడిన బాలిక మృతదేహం ఫొటోను జనవరి 30న సోషల్‌మీడియాలో చూసిన తల్లి నిజామాబాద్ జీజీహెచ్ కు వచ్చి.. డెడ్‌బాడీ ప్రాచీదిగా గుర్తించింది. పోలీసుల దర్యాప్తులో పదవిపై ఆశతో సొంత కూతురినే పాండురంగ హత్య చేసినట్టు తేలింది. అతనితోపాటు సహకరించిన గణేశ్షిండేను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు. ఈ కేసును చేధించిన బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు , ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ, రెంజల్ఎస్సై చంద్రమోహన్ ను సీపీ అభినందించారు.
