- త్వరలోనే పనులు చేపడుతామని వెల్లడి
కోల్బెల్ట్/జైపూర్, వెలుగు: టేకుమట్ల వాగుపై కొత్త బ్రిడ్జి నిర్మాణానికి రూ.11.19 కోట్లు మంజూరు చేశామని, త్వరలోనే నిర్మాణ పనులు చేపడతామని రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల శివారులోని వాగు ప్రవాహం పెరిగిన నేపథ్యంలో శుక్రవారం మంత్రి వివేక్ పరిశీలించారు.
వాగుపై ఉన్న లోలెవల్ బ్రిడ్జి మీదుగా వరద ప్రవాహం పెరగడంతో ఇందారం నుంచి కుందారం వరకు రాకపోకలు కష్టంగా మారుతున్నాయని కాంగ్రెస్ లీడర్లు, గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి టేకుమట్ల వాగుపై కొత్త బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు చేపట్టి ప్రజల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపుతానని భరోసా ఇచ్చారు.
