- ఇల్లు కూలి గాయపడిన బాధితులను పరామర్శించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆలుగామలో వర్షాల ధాటికి ఇల్లు కూలిపోయి నిరాశ్రయులైన మాంతయ్య కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. ఇల్లు కూలడంతో గాయాలై మంచిర్యాల జీజీహెచ్ ఐసీయూలో చికిత్స పొందుతున్న మాంతయ్య భార్య లక్ష్మి, చిన్న కొడుకు అనిల్‌ను గురువారం మంత్రి పరామర్శించారు. బాధితులకు మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని డాక్టర్లకు సూచించారు. మాంతయ్య కుటుంబానికి వెంటనే ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్‌కుమార్ దీపక్‌ను కోరారు.
ప్రభుత్వం నుంచి రావాల్సిన తక్షణ ఆర్థిక సాయాన్ని వెంటనే అందించాలని తహసీల్దార్ రాఘవేందర్ రావును ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పురాతన, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండవద్దని సూచించారు. వర్షాల తీవ్రత దృష్ట్యా క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా చెన్నూరులో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, ఇబ్బందులెదురైతే సంప్రదించాలన్నారు. డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథ్‌రెడ్డి, డీఎంహెచ్‌వో నరేందర్, ఆర్ఎంవో శ్రీధర్పాల్గొన్నారు.
