ముషీరాబాద్, వెలుగు: ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు వయోపరిమితి సడలించి, 19 వేల పోస్టులతో పోలీస్ నియామక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు గురువారం రాత్రి చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులతో పాటు మెగా డీఎస్సీ, గ్రూప్స్, ఇతర శాఖల్లోని ఖాళీ పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్‌నగర్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన అభ్యర్థులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
