- ఘటనపై సుమోటోగా కేసు నమోదు
అబిడ్స్, వెలుగు: హైదరాబాద్‌లోని మాదాపూర్ వైశాలీనగర్ రైల్వే అండర్‌పాస్ వద్ద తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో వృద్ధుడు గల్లంతైన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్‌హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా స్పందించింది. పత్రికల్లో ప్రచురితమైన కథనాల ఆధారంగా కమిషన్ చైర్మన్ జస్టిస్ షామీమ్ అక్తర్ స్వయంగా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారు.
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బాలయ్య(75) కుమార్తె ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి గల్లంతైన ఘటనను కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగేలా మ్యాన్‌హోల్ నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కమిషన్ ప్రశ్నలు లేవనెత్తింది.
ఘటనకు సంబంధించి తీసుకున్న చర్యలు, భద్రతా ప్రమాణాలు, బాధ్యులపై చేపట్టిన చర్యలు, వృద్ధుడి కోసం కొనసాగిస్తున్న గాలింపు చర్యలు, ఆయన పరిస్థితిపై సమగ్ర నివేదికలను ఆగస్టు 25 లోగా సమర్పించాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్, హైడ్రా కమిషనర్‌లను ఆదేశించింది.
