మంచిర్యాల/కోల్‌బెల్ట్/ చెన్నూరు, వెలుగు: ‘‘వర్షాలు రావద్దు... రైతులు ఆగం కావాలని బీఆర్ఎస్ లీడర్లు మొక్కుకున్నరు.. కానీ వర్షాల కోసం కాంగ్రెస్ నేతలు పూజలు చేశారు. మా పూజలు ఫలించి రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి’’అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.
గురువారం మంచిర్యాలలోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోందని, దీంతో నందిమేడారం పంపులను ఓపెన్ చేశామని చెప్పారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే పంపులు నడుస్తున్నాయని, ఒకవేళ కన్నెపల్లి నుంచి ఎత్తిపోస్తే ఆ నీళ్లు మళ్లీ గోదారి పాలయ్యేవన్నారు.
‘‘కేసీఆర్ అనాలోచిన నిర్ణయాల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిలైంది. అది సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టు అని చెప్పుకోవడానికే కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయాలని బీఆర్‌ఎస్ లీడర్లు డ్రామా చేశారు. బీఆర్ఎస్ హయాంలో నాలుగేండ్లలో 160 టీఎంసీలు మాత్రమే లిఫ్టింగ్ చేశారు. పైనుంచి వరదలు రావడంతో ఎత్తిపోసిన నీళ్లన్నీ మళ్లీ గోదావరిలోకి వదిలారు.
కరెంటు బిల్లులకు రూ.4 వేల కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు కన్నెపల్లి నుంచి ఎత్తిపోస్తే మరో రూ.4 వేల కోట్లు వృథా అయ్యేవి”అని అన్నారు. కేసీఆర్‌ను పక్కనబెట్టి పార్టీని తమ చేతుల్లోకి తీసుకోవడానికి బీఆర్‌ఎస్‌లో కేటీఆర్, హరీశ్ రావు పోటీ పడుతున్నారని, ఈ క్రమంలో ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ప్రాణహిత ప్రాజెక్టు నిర్మిస్తాం..
ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం కాకా వెంకటస్వామి కల అని మంత్రి వివేక్ అన్నారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రూ.11 వేల కోట్లు ఖర్చుపెట్టామని, మరో రూ.26 వేల కోట్లు వెచ్చిస్తే ప్రాజెక్టు పూర్తయి, గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు వచ్చేవన్నారు. కేసీఆర్ కమీషన్ల కోసం రీడిజైనింగ్ చేసి రూ.లక్ష కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి కట్టుబడి ఉందని, ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే మహారాష్ట్రతో అగ్రిమెంట్ జరుగుతుందని చెప్పారు. మరోవైపు, బీఆర్ఎస్ హయాంలో సింగరేణికి కొత్త గనులు రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యే అయ్యాక వేలంలో పాల్గొనడానికి సీఎంను ఒప్పించానని చెప్పారు.
ఇటీవల తాడిచర్ల ఫేస్ 2, మణుగూరు గనులను సింగరేణికి కేటాయించడానికి కేంద్రం ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను కలిసి ఎంపీ వంశీకృష్ణ కోరారని చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో తాడిచర్ల ఫేస్1 కోల్ బ్లాక్ కేటాయింపులో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని సీఎంను కోరుతానని తెలిపారు.
జెన్ జడ్ నిరసనలతో మోదీకి కనువిప్పు..
నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో జెన్‌జీ నిరసనలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కనువిప్పు కలిగిందని, ఆయన తన రాజకీయ ప్రస్థానంలో మొదటిసారి ప్రజల గొంతుక విన్నారని మంత్రి వివేక్ అన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై మొలలు ఉన్న కర్రలతో లాఠీఛార్జ్ చేయడాన్ని కాంగ్రెస్ ఖండిస్తోందన్నారు. నీట్ ఎగ్జామ్‌లో కేటీఆర్ బినామీ సంస్థ గ్లోబరీనా పాత్ర ఉందని ఆరోపించారు.
మరోవైపు, కాకా వెంకటస్వామి ఫౌండేషన్, విశాక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్‌లో గత 20 ఏండ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇది ఏ పార్టీ లేదా ప్రభుత్వ కార్యక్రమం కాదని, స్వచ్ఛందంగా విద్యార్థులకు బ్యాగులు పంచడం కోసం గూడెం స్కూల్‌కు వెళ్లిన ఎంపీ వంశీకృష్ణను అడ్డుకోవడం సరికాదన్నారు. ఇందులో ఎవరికి అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
వర్ష ప్రభావ ప్రాంతాల పరిశీలన..
భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. మందమర్రి, చెన్నూరు మండలాల్లో వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలను గురువారం కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్‌తో కలిసి ఆయన పరిశీలించారు. మందమర్రి 7వ వార్డులో అయిల్ల కనుకమ్మ ఇల్లు కూలిపోయింది. ఇంటిని పరిశీలించి బాధిత కుటుంబానికి పరిహారం అందించి ఇంటిని నిర్మించేలా చర్యలుతీసుకోవాలని ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల వల్ల నష్టపోయిన రైతులు, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చెన్నూరులో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, ఆగస్టు చివరి నాటికి ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. మంత్రి వెంట మందమర్రి తహసీల్దార్ సతీశ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు.
