హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యాల్లో భాగంగా రాష్ట్రంలో ఆధునిక బానిసత్వాన్ని పూర్తిగా నిర్మూలించాలని ప్రముఖులు పిలుపునిచ్చారు. ‘వరల్డ్ డే అగైనెస్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్’ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, ఐజేఎం ఆధ్వర్యంలో శామీర్‌పేట్‌లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ సేవల సంస్థ మెంబర్ సెక్రటరీ చి.పంచాక్షరి, నల్సార్ వైస్ చాన్స్‌లర్ కృష్ణదేవరావు కలిసి రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అవగాహన కల్పించే ‘స్వేచ్ఛా రథం’ను ప్రారంభించారు.
వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందిన 380 మంది బాధితులు తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం బంధిత కార్మికుల అవగాహన గీతం, వెట్టి చాకిరీ కార్మిక వ్యవస్థ(రద్దు) చట్టం 50 ఏండ్ల స్మారక పుస్తకం, టోల్‌ఫ్రీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. దోపిడీకి గురవుతున్న కార్మికులు భయపడకుండా ముందుకు వచ్చి ప్రభుత్వ సాయం పొందేలా చూడాలని, పోలీసు, రెవెన్యూ, కార్మిక శాఖలు, పౌరసమాజ సంస్థలు సమన్వయంతో పనిచేసి బాధితులకు దీర్ఘకాలిక పునరావాసం కల్పించాలని ప్రముఖులు సూచించారు.
