వెలుగు స్పోర్ట్స్ డెస్క్: సాధారణంగా క్రికెట్ ప్రపంచంలో ఒక మెగా ఈవెంట్, అందులోనూ వరల్డ్ కప్ వంటి టోర్నీ వస్తుందంటే ఆ హడావిడి వేరే లెవల్‌లో ఉంటుంది. స్టేడియాలన్నీ కొత్త రంగులు అద్దుకుంటాయి. నగరాలు హోర్డింగులతో నిండిపోతాయి.. అభిమానుల గుండెల్లో ఉత్కంఠ ఉరకలేస్తుంటుంది. మరీ ముఖ్యంగా క్రికెట్‌ను మతంగా ఆరాధించే ఇండియా ఆతిథ్య దేశం అయినప్పుడు ఆ సందడి ఆకాశాన్ని తాకాలి.
కానీ, దురదృష్టవశాత్తు ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఇండియా వేదికగా మరో నాలుగు రోజుల్లో (ఈ నెల 7 నుంచి) టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా మెగా ఈవెంట్ జోష్ లేకుండా పోయింది. సంబరాలు కనిపించాల్సిన చోట ఆందోళన, ఉత్సాహం ఉరకలెత్తాల్సిన వేళ ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి.
ముస్తాఫిజుర్‌పై వేటుతో మొదలైన మంట..
ఈ మొత్తం రగడకు కేంద్ర బిందువు బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ ఐపీఎల్ కాంట్రాక్టును బీసీసీఐ రద్దు చేయడం. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌లో ఆడిస్తే స్టేడియంలో ఆందోళన చేపడుతామన్న రాజకీయ పార్టీలు, నాయకుల హెచ్చరికలతో బీసీసీఐ అతడిని లీగ్ నుంచి తప్పించడంతో ఈ రగడ మొదలైంది. అయితే, అది అంతటితో ఆగుతుందని అందరూ భావించారు.
కానీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ ఆటగాడికి జరిగిన అవమానానికి నిరసనగా.. తాము ఇండియా గడ్డపై అడుగుపెట్టేది లేదని భీష్మించుకు కూర్చుంది. చర్చలతో సమస్యను పరిష్కరించాల్సిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పరిస్థితిని చేతులారా సంక్లిష్టంగా మార్చింది అనొచ్చు. బంగ్లాదేశ్ మొండి వైఖరికి సీరియస్ అయి ఏకంగా ఆ దేశాన్ని టోర్నీ నుంచే తప్పించింది. దాని స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చి క్రికెట్ వర్గాలను షాక్‌కు గురిచేసింది.
పాక్ ఎంట్రీతో పతాక స్థాయికి
నిప్పుకు ఆజ్యం తోడైనట్లు బంగ్లాదేశ్ ఎపిసోడ్‌లోకి పాకిస్తాన్ ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి మరింత జఠిలమైంది. బంగ్లాదేశ్‌కు సంఘీభావం ప్రకటిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన ప్రకటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ప్రపంచం మొత్తం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసే, ఐసీసీకి కాసుల వర్షం కురిపించే ఇండియా– పాకిస్తాన్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఇండో–పాక్ మ్యాచ్ లేని వరల్డ్ కప్‌ను అభిమానులు ఊహించుకోలేకపోతున్నారు. పాక్ ప్రభుత్వ నిర్ణయం కేవలం ఒక మ్యాచ్‌ను వదులుకోవడం కాదు, టోర్నీ ఆత్మనే దెబ్బతీయడమని భావిస్తున్నారు. ఇండియాతో మ్యాచ్ ఆడకుండా పాకిస్తాన్ టోర్నీలో కొనసాగినా, ఆ కిక్ ఉండదన్నది సగటు అభిమాని ఆవేదన.
నిరాశలో ఫ్యాన్స్.. షాక్‌లో స్పాన్సర్లు
తాజా పరిణామాలతో అత్యంత నష్టపోతున్నది మాత్రం క్రికెట్ అభిమానులే. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వేలాది మంది ఫ్యాన్స్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరోవైపు వేల కోట్లు పెట్టుబడి పెట్టిన స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇండియాలో టోర్నీ అంటే లాభాల పంట అని ఆశపడ్డ వారికి, ఈ వివాదాలు నష్టాల ముప్పును తెచ్చిపెట్టాయి.
టోర్నీకి ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది. కప్పు నుంచి బహిష్కరణకు గురైన బంగ్లా సైలెంట్ అయిపోయింది. దాని ప్లేస్‌లో వచ్చిన స్కాట్లాండ్ ఇండియా చేరుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. పాక్ ప్రభుత్వం ఇండియాతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా స్పష్టం చేశాడు.
ఒకవేళ పాక్ సెమీస్ లేదా ఫైనల్ చేరి ఇండియాతో ఆడాల్సి వస్తే దాన్ని కూడా బాయ్‌కాట్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు.. ఇంకోవైపు ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే పాక్‌ను టోర్నీ నుంచి తప్పించడంతో పాటు పీసీబీపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఐసీసీ రెడీ అవుతోందన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి, ఈ హైడ్రామా మధ్య అసలు వరల్డ్ కప్ సజావుగా సాగుతుందా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఏదేమైనా జెంటిల్మెన్ గేమ్ అని పిలుచుకునే క్రికెట్.. ఇప్పుడు పొలిటికల్ గేమ్‌గా మారిపోవడం నిజంగా శోచనీయం.
