జర్మనీ భాష భవిష్యత్తుకు బాట.. మంత్రి వివేక్ చొరవతో ప్రత్యేక కోర్సులు..

జర్మనీ భాష భవిష్యత్తుకు బాట.. మంత్రి వివేక్ చొరవతో ప్రత్యేక కోర్సులు..

ఒక మనిషి జీవితాన్ని, ఒక సమాజ భవిష్యత్తును మార్చగలిగే అతిపెద్ద శక్తి విద్య మాత్రమే.  తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.  చదువుతోనే బతుకు బాగుపడుతుంది అనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉన్నత విద్య వరకు అనేక సంస్కరణలు తీసుకొస్తోంది. గురుకుల పాఠశాలలు, స్కాలర్​షిప్స్,  ఫీజు రీయింబర్స్‌‌మెంట్ వంటి పథకాల ద్వారా పేద విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తోంది.  

నెల్సన్ మండేలా అన్నట్లు చదువుతో వ్యక్తి ఆలోచనలు ఉన్నతంగా మారతాయి.  ఆలోచనలు మారితే జీవన విధానమూ మారుతుంది. ఉపాధి అవకాశాలు కూడా  పెరుగుతాయి. కుటుంబ ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతుంది.  నేడు తెలంగాణ యువత ప్రపంచంతో పోటీపడాలంటే కేవలం డిగ్రీలు చాలవు.  ప్రపంచం చిన్నదైపోయింది. అందుకే రాష్ట్ర  ప్రభుత్వం నేటి యువతను జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాల భాషలు నేర్చుకోవాలని ప్రోత్సహిస్తోంది. 

జర్మన్  భాష  నేర్చుకుంటే  జర్మనీలో ఇంజినీరింగ్,  నర్సింగ్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి.  ఇతర విదేశీ భాషలు నేర్చుకోవడం వల్ల యువతకు గ్లోబల్ ఉద్యోగాలు, ఉన్నత చదువులకు ద్వారాలు తెరుచుకుంటాయి.  చదువు, నైపుణ్యం, భాషా పరిజ్ఞానం.. ఈ మూడింటి కలయికతోనే మన యువత ప్రపంచ స్థాయిలో రాణించగలదు. ‘ఏఐ యుగంలో  స్కిల్ లేకుండా బతకడం చాలా కష్టం. మన పిల్లలకు ప్రపంచంతో పోటీపడే శక్తి ఇవ్వాలి’ అంటూ సీఎం ఎ. రేవంత్​రెడ్డి రాష్ట్ర విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం శుభపరిణామం. 

ఏఐ వేగంగా పెరుగుతున్నవేళ  లక్షల మంది  ఉద్యోగాలు  కోల్పోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం ముందే అంచనా వేసింది.  అందుకే  స్కిల్ డెవలప్‌‌మెంట్‌‌ని  ప్రధానంగా తీసుకుని,  తెలంగాణ యువతను  విదేశీ ఉద్యోగాలకు సిద్ధంచేసే బాధ్యతను తీసుకుంది. ఇలా ఒక్కొక్కటిగా  విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తూ.. సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది ప్రభుత్వం. 

విద్యలో కొత్త మార్పులు

నిజానికి  కాలేజీలు  కేవలం డిగ్రీలు ఇచ్చే ఫ్యాక్టరీలు కాకూడదు. టాలెంట్‌ని స్కిల్‌గా మార్చే కేంద్రాలు కావాలి. ఈ ఉద్దేశంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. పేద,  మధ్యతరగతి పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్య అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు నైపుణ్యం ఉన్న మానవ వనరులను తయారు చేయడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఇప్పటికే ప్రారంభించారు.  

పేద, మధ్య తరగతి పిల్లలకు ప్రపంచ స్థాయి విద్య అందించడమే వీటి ఉద్దేశం. చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇచ్చి, తెలంగాణను విద్యా,  క్రీడా కేంద్రంగా మార్చేందుకు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ  ( వైఐఎస్‌‌యూ) కూడా వస్తోంది.  వైఐఎస్‌‌యూ  ఏర్పాటు ద్వారా ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టు స్కిల్డ్ మ్యాన్ పవర్‌‌ను తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది. 

స్కిల్స్ కేంద్రాల కేరాఫ్ ‘ఏటీసీ’

ఇప్పటికే అన్ని ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నారు. అంటే అడ్వాన్స్‌‌డ్ టెక్నాలజీ సెంటర్స్. ఇక్కడ సెమీకండక్టర్, రోబోటిక్స్,  ఏఐ, జర్మన్ కోర్సులు బోధిస్తారు. విదేశాల్లో ఉద్యోగాలు రావాలంటే జర్మన్, జపాన్, ఇంగ్లీష్ భాషలతోపాటు అవసరమైన ఇతర నైపుణ్యాలను కూడా నేర్పిస్తున్నారు. ఇవి నేటి విద్యార్థులకు అవసరం కూడా.   యూరప్‌‌లో  ముఖ్యంగా  జర్మనీలో  నైపుణ్యం ఉన్న కార్మికులకు చాలా డిమాండ్ ఉంది.  ఈ  అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జర్మన్ భాషకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది.  

యూరప్ దేశాల్లో ముఖ్యంగా జర్మనీలో స్కిల్డ్ వర్కర్స్ కు భారీ డిమాండ్ ఉంది. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు  ప్రభుత్వం జర్మనీ భాషకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. 2026 జూన్‌లో  సీఎం రేవంత్ రెడ్డి  జర్మనీలోని  థురింగియా రాష్ట్ర అధిపతి మారియో వోయిట్‌‌తో భేటీ అయ్యారు.  టెక్నాలజీ,  స్కిల్ ట్రైనింగ్, స్టార్టప్స్,  లైఫ్ సైన్సెస్  రంగాల్లో సహకారం కోసం ఒప్పందం  కూడా కుదుర్చుకున్నారు.

కొత్త టెక్నాలజీలపై విద్యార్థులకు పట్టు ఉండాలి 

ఏఐ వచ్చాక పాత కోర్సులు మాత్రమే చాలవు. డిజిటల్ పరిజ్ఞానం,  కొత్త టెక్నాలజీలపై విద్యార్థులకు పట్టు ఉండాలి.  పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా పరిశ్రమలకు కావాల్సిన శిక్షణ ఇస్తున్నారు. విద్య, పరిశ్రమ, ఉపాధిని ఒకే చోటకి తెచ్చి యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.  జర్మనీతోపాటు ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా మన యువత రాణించేలా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. 

గ్రామీణ యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు నేర్పించి, అటు విదేశాల్లోను, ఇటు స్థానికంగా కూడా ఉద్యోగాలు ఇవ్వడమే ప్రధాన లక్ష్యం. మొత్తంగా ప్రభుత్వం తెలంగాణను ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ హబ్‌‌గా మార్చడానికి వడివడిగా అడుగులు వేస్తోంది.  దీనిలో  భాగంగా జర్మనీ, జపాన్ భాషాలతో ఏటీసీల ద్వారా యువతను గ్లోబల్ మార్కెట్‌కు సిద్ధం  చేస్తోంది. మంత్రి వివేక్ వెంకటస్వామి టామ్ కాం ద్వారా ఈ ప్రక్రియకు మరింత ఊపిరి పోస్తున్నారు. 

మంత్రి ప్రత్యేక చొరవ

ఐటీఐలను ఏటీసీలుగా మార్చడంలో  కార్మికశాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి  ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అంతర్జాతీయ అవసరాలకు, ముఖ్యంగా యూరప్ అవసరాలకు అనుగుణంగా కోర్సులు రూపొందిస్తున్నారు. ఇక టామ్ కాం కోసం బడ్జెట్ లో రూ. 90 కోట్లు కేటాయించారు. 

ఈ సంస్థ ద్వారా 4 నెలల్లోనే విద్యార్థులకు జర్మన్ భాష నేర్పిస్తున్నారు. జర్మన్ నేర్చుకున్నవారికి ఆ దేశంలో దాదాపు 2.5 లక్షల జీతంతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇప్పటికే టామ్‌‌ కాం ద్వారా శిక్షణ పొందిన చాలామంది విదేశాల్లో పని చేస్తున్నారు. యూరప్‌లో నైపుణ్యం ఉన్న వారికి కొరత ఉంది. మన దగ్గర యువత ఉంది. ఇక్కడ భాష, స్కిల్స్ నేర్పించి పంపితే చాలా అవకాశాలు ఉన్నాయి. 

మన పిల్లలు ప్రపంచంలో ఎక్కడైనా నిలబడాలి. దానికి భాష, నైపుణ్యం రెండూ అవసరం అనేది ప్రభుత్వ విధానం. రాష్ట్రంలో 120 ఏటీసీల ద్వారా ప్రతి ఏటా 25 వేల మందికి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.  జర్మనీలో ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉంటాయి. మన దేశానికి ఏడాదికి 90 వేల వీసాలు ఇవ్వడానికి జర్మనీ సిద్ధంగా ఉంది.

- ఉపేందర్ పెండెం 
సీనియర్ జర్నలిస్ట్

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీopenpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. 
  • స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.