- ఆర్మీ మాజీ చీఫ్ నరవణె రాసిన బుక్‌పై లోక్‌సభలో రగడ
- ఇండియాలోకి చైనా ఆర్మీ ప్రవేశించినట్టు బుక్‌లో ఉందన్న ప్రతిపక్ష నేత
- బుక్‌పై ఓ మ్యాగజైన్‌లో ప్రచురితమైన కథనాన్ని చూపుతూ నిలదీత
- పబ్లిష్ కాని బుక్‌ను ఎలా పరిగణనలోకి తీసుకుంటారన్న రాజ్‌నాథ్
- కల్పిత విషయాలతో సభను తప్పదోవ పట్టించొద్దన్న అమిత్ షా
- సభను రోజంతా వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా
న్యూఢిల్లీ: లడఖ్ సరిహద్దు వివాదంపై భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవణె రాసిన (ప్రచురితం కాని) పుస్తకం పార్లమెంట్‌లో పెను దుమారం రేపింది. ఈ అంశంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఈ రగడ మొదలైంది. అంతకుముందు మాట్లాడిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య, కాంగ్రెస్ జాతీయవాదంపై చేసిన ఆరోపణలకు సమాధానం ఇస్తానని చెబుతూ రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఈ క్రమంలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణే రాసిన పుస్తకం గురించి ప్రస్తావించారు. జనరల్ నరవణె తన పదవీకాలంలోని అనుభవాలతో ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ అనే పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. 2020లో లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-–చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల గురించి ఇందులో కీలక విషయాలు ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ పుస్తకం ఇంకా అధికారికంగా ప్రచురణ కాలేదు. దీనిపై ఒక ప్రముఖ మ్యాగజైన్ ప్రచురించిన కథనాన్ని ఆధారంగా చేసుకొని రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షం కురిపించారు. సదరు మ్యాగజైన్ ఆర్టికల్‌ను చూపిస్తూ.. లడఖ్ సరిహద్దులో చైనా ట్యాంకులు భారత భూభాగంలోకి వచ్చాయని పేర్కొన్నారు. ఈ పుస్తకంలో ఉన్న విషయాలు 100 శాతం వాస్తవమని, ప్రభుత్వం దీనికి ఎందుకు భయపడుతున్నదని ప్రశ్నించారు. కాగా, రాహుల్‌గాంధీ తన ప్రసంగంలో పదే పదే చైనీస్ ట్యాంకులు అనే పదం రిపీట్ చేయడాన్ని సభలోని బీజేపీ సభ్యులంతా వ్యతిరేకించారు.
రాహుల్ ప్రసంగంపై బీజేపీ సభ్యుల అభ్యంతరం
నరవణె రాసిన బుక్‌పై సంభాషణను ప్రారంభించడానికి రాహుల్ గాంధీ పదే పదే ప్రయత్నించగా.. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోపాటు హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అడ్డుకున్నారు. రాహుల్ ప్రసంగిస్తుండగానే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోక్యం చేసుకున్నారు. ‘‘ఇంకా ప్రచురణే కాని పుస్తకాన్ని సభలో కోట్ చేయడం నిబంధనలకు విరుద్ధం. ఆ పుస్తకం మీ దగ్గర ఉంటే సభ ముందు ఉంచండి’’ అని సవాల్ విసిరారు. ప్రచురితం కాని పుస్తకంలోని అంశాల గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. రాహుల్ చెబుతున్న బుక్ ఇంకా పబ్లిష్ కాలేదని, అలాంటప్పుడు అందులోని విషయాలను ఆయన ఎలా ప్రస్తావిస్తారని అమిత్ షా వ్యాఖ్యానించారు. సభను అవమానించేలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. వార్తాపత్రికల క్లిప్పింగులు, ప్రచురణ కాని పుస్తకాలకు సంబంధించిన విషయాలను లోక్‌సభలో ప్రస్తావించకూడదని రూల్ బుక్ నియమాలను చదివి వినిపించారు. రాష్ట్రపతి ప్రసంగంపై, ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై మాట్లాడాలని రాహుల్ గాంధీకి సూచించారు. ‘‘లోక్‌సభలో స్పీకర్ తీర్పును పాటించని సభ్యుడిని ఏమి చేయాలో కూడా మనం చర్చించాలి” అని కిరణ్ రిజిజు అన్నారు.
సభా సమయాన్ని రాహుల్ వేస్ట్ చేశారు: రిజిజు
రాహుల్ గాంధీపై కిరణ్ రిజిజు తీవ్ర విమర్శలు చేశారు. లోక్‌సభ సమావేశాల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్మీ మాజీ చీఫ్ ప్రచురించని పుస్తకాన్ని ఉటంకించడానికి ప్రయత్నించడం ద్వారా స్పీకర్ రూలింగ్‌ను రాహుల్ గాంధీ ధిక్కరించారని, సభా సమయాన్ని వృథా చేశారని ఆరోపించారు. కేవలం అథెంటికేటెడ్ పత్రాలను మాత్రమే సభలో ప్రస్తావించాలని స్పీకర్ ఓం బిర్లా స్పష్టమైన రూలింగ్ ఇచ్చారని గుర్తుచేశారు. సభ నిబంధనల ప్రకారం.. చర్చకు సంబంధం లేని పక్షంలో పుస్తకాలు, పత్రికలు లేదా వార్తా క్లిప్పింగ్‌ల ప్రస్తావన తేకూడదని ఆయన పేర్కొన్నారు.
రాహుల్‌కు ప్రతిపక్ష సభ్యుల మద్దతు
రాహుల్ గాంధీకి పలువురు ప్రతిపక్ష నాయకులు మద్దతుగా నిలిచారు. ‘‘చైనాకు సంబంధించిన విషయం చాలా సున్నితమైనది. లోక్‌సభలో మాట్లాడటానికి ప్రతిపక్ష నేతకు అనుమతించాలి” అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కోరారు. ‘‘అతను సైన్యాన్ని కించపరచడానికి ప్రయత్నించడం లేదు. ఆర్మీ మాజీ చీఫ్ పుస్తకం నుంచి ఒక సారాంశాన్ని చదువుతున్నారు. వారు (బీజేపీ) దాచాలనుకుంటున్నది బయటకు వచ్చినప్పుడల్లా ఇలాగే చేస్తారు’’ అని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో సభ రెండుసార్లు వాయిదా పడింది. మళ్లీ సభ మొదలుకాగానే రాహుల్ గాంధీ ఆ పుస్తకం గురించే మాట్లాడేందుకు ప్రయత్నించగా.. చివరకు సభను స్పీకర్ ఓంబిర్లా రోజంతా వాయిదా వేశారు.
