హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మేం నేరాలు చేస్తాం కానీ వాటిని విచారించొద్దు అనడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంతో అక్రమాలకు పాల్పడితే ఎవరైనా విచారణ ఎదుర్కొవాల్సిందేనని స్పష్టం చేశారు. అక్రమ మార్గాలు ఎంచుకున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ తప్పదని పేర్కొన్నారు. నేరాలను విచారించవద్దని ఎక్కడ లేదన్నారు. తెలంగాణ సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించడమేంటని బీఆర్ఎస్ గగ్గోలు పెడుతుంది.. గతంలో మాజీ సీఎంలు శిబూసోరెన్, జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్, యడియూరప్ప విచారణ ఎదుర్కొలేదా అని ప్రశ్నించారు.
తప్పు చేస్తే ఎవరైనా విచారణ ఎదుర్కొవాల్సిందేనని తేల్చిచెప్పారు. నేను ఎక్కడ ఉంటే అక్కడికే వచ్చి విచారణ చేయాలనడం ఏంటని కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. మీరు రాజులు, చక్రవర్తులు కాదని చురకలంటించారు. సోమవారం (ఫిబ్రవరి 2) బంజారాహిల్స్‌లోని రావి నారాయణ రెడ్డి మెమోరియల్ ఆడిటోరియంలో 'రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు-2025' ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గా పాల్గొని ప్రసంగించారు.
‘‘ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు ఇస్తారా అంటున్నారు.. ఉద్యమకారులను అవమానిస్తారా అని గగ్గోలు పెడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదవులన్నీ కేసీఆర్ కుటుంబం అనుభవించింది. వందల ఎకరాల ఫాంహౌస్‌లు, వేల కోట్ల వ్యాపారాలు మీకెలా వచ్చాయి..? పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు చేయాల్సిన తప్పులన్నీ చేశారు. అలాంటి మీరు తెలంగాణ జాతిపిత ఎలా అవుతారు..? ఉద్యమకారులు ఎలా అవుతారు..? ” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ ఉద్యమకారులకు అవమానం జరిగిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్‌ను బీఆర్ఎస్ పాలనలో ఆయనను ఎలా అరెస్ట్ చేశారో మర్చిపోయారా అని నిలదీశారు. మీ పాలనలో ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఆయనను అరెస్ట్ చేశారు. కానీ మేం కేసీఆర్ ఇంటి తలుపులు బద్దలు కొట్టలేదు.. ఇంట్లో నంచి ఈడ్చుకు రాలేదు.. ప్రజాస్వామ్య బద్ధంగా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచామని అన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రజల తిరస్కారానికి గురయ్యారని.. ప్రజలు తిరస్కరించినప్పుడు నాయకులు అర్ధం చేసుకోవాలని హితవు పలికారు. అంతేకానీ మీకు ఓటు వేయకపోతే ప్రజలదే తప్పుంటున్నారని బీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు.
