విశ్వవ్యాప్తంగా మన్ననలు పొందుతున్న భారతదేశ ప్రజాస్వామ్యానికి సమాఖ్య వ్యవస్థ ప్రధాన పునాది. వివిధ భాషలు, జాతులు, సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన రాష్ట్రాలున్న భారత్‌లో భిన్నత్వంలో ఏకత్వం సూత్రాన్ని పాటించడంలో సమాఖ్య స్ఫూర్తి ఆదర్శంగా నిలుస్తోంది. దేశంలో సమాఖ్య వ్యవస్థ.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరిసమానంగా అధికారాలను విభజిస్తుంది. ఒకవైపు రాష్ట్రాల అవసరాలు తీరుస్తూ, మరోవైపు జాతీయ సమగ్రతను కూడా సమాఖ్య వ్యవస్థ పరిరక్షిస్తోంది. అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయాలతో దేశ సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగిస్తోంది. రాజకీయాలకు అతీతంగా బడ్జెట్ కేటాయింపులు చేయాల్సిన కేంద్రం వివక్ష చూపించడం దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్రంపై మొదటి నుంచీ పక్షపాత ధోరణి చూపిస్తున్న మోదీ ప్రభుత్వం మరోసారి 2026-27 బడ్జెట్‌లోనూ అన్యాయం చేసింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ సమగ్ర అభివృద్ధికి కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంది.
రాజకీయాలకు అతీతంగా తెలంగాణ అభివృ ద్ధికి సహకరించాలని రాష్ట్ర విన్నపాలను కేంద్రం పెడచెవిన పెడుతోంది. సీఎం రేవంత్ రెడ్డితో సహా రాష్ట్ర మంత్రులు ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను పలుమార్లు స్వయంగా కలిసి విన్నవించినా ప్రయోజనం లేదు. హైదరాబాద్ చుట్టూ 350 కి.మీల ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్ట్‌కు రూ.34,367.62 కోట్లు, రేడియల్ రోడ్ల కోసం రూ.45వేల కోట్లు, మెట్రో రైల్ కోసం రూ.44,028 కోట్లు, గోదావరి మూసీ అనుసంధానానికి రూ.6 వేల కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ.17,212.69 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని బందర్ నుంచి హైదరాబాద్ వరకు డ్రై పోర్టు గ్రీన్‌ఫీల్డ్ హైవేకి రూ.17 వేల కోట్లు మంజూరు చేయాలని తెలంగాణ పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది.
నిధుల కేటాయింపులో వివక్ష
కేంద్రానికి మనం ఇస్తున్న మొత్తంలో కనీసం సగం కూడా రాష్ట్రానికి తిరిగి దక్కడం లేదు. దేశానికి అత్యధిక ఆదాయం సమకూరుస్తున్న రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణను ప్రోత్సాహించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో వివక్ష ప్రదర్శిస్తోంది. ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీ వసూళ్లలోనూ తెలంగాణ సత్తా చాటుతూ గత ఐదేండ్లలో రూ.4.32 లక్షల కోట్లు (దేశంలో 3.87 శాతం) కేంద్రానికి చేరిస్తే, తిరిగి ఇవ్వడంలో కొర్రీలు పెడుతోంది. ఇటీవల లోక్ సభలో ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపిన గణంకాల ప్రకారం గత ఆరు సంవత్సరాలలో తెలంగాణ నుంచి రూ.4,35,920 కోట్లు వసూలైతే కేంద్రం రాష్ట్రానికి రూ.3,76,175.19 కోట్లే ఇచ్చింది. అంటే 86.29 శాతమే ఇస్తూ 13.71 శాతం కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి తెలంగాణకు రూ.22,782 కోట్లు వస్తాయని అంచనా వేయగా 10 నెలల్లో రూ.4 వేల కోట్లు మాత్రమే రావడం ఆందోళనకరం. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధిపరుస్తూ ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే కేంద్రం సహకరించడం లేదు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంగా రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. రాష్ట్ర అభివృ ద్ధితోపాటు ప్రజా సంక్షేమం అందించేందుకు ఆర్థికంగా బలపడాల్సిన ఆవశ్యకత గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాలు రూపొందించింది. అందులో భాగంగా 2025 డిసెంబర్లో హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ‘గ్లోబల్ సమ్మట్’తో పాటు 2024, 2025, 2026లో దావోస్ వేదికగా భారీగా పెట్టుబడులు సాధించి రాష్ట్ర ఆర్థిక బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం పునాదులేస్తున్నా కేంద్రం సహకరించడం లేదు.
ఉత్తరాది రాష్ట్రాలకు పెద్దపీట
నూతన రాష్ట్రం తెలంగాణపై మోదీ ప్రభుత్వం మొదటి నుంచి వివక్ష చూపిస్తోంది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన సంస్థలు, ప్రాజెక్టులు, నిధులు మంజూరు చేయడం లేదు. తెలంగాణ ఏర్పాటుపై పలుమార్లు అవమానకరమైన రీతిలో వ్యాఖ్యానించిన ప్రధాని మోదీ కక్ష తీర్చుకుంటున్నారా అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోంది. కేంద్రం తెలంగాణపైనే కాదు ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలపై రాజకీయ పక్షపాతంతో దేశ సమాఖ్య స్ఫూర్తికి తిలోదకాలు ఇస్తోంది. నిధుల కేటాయింపులో జనాభా ప్రాతిపదికన ఉత్తరాది రాష్ట్రాలకు పెద్ద పీటవేస్తూ, జనాభా నియంత్రణతో దేశ అభివృద్ధికి పాటుపడుతున్న దక్షిణాది రాష్ట్రాలకు మొండిచేయి చూపించడం దురదృష్టకరం. బీజేపీకి తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలున్నా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదు. రాష్ట్రం నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోరు. ప్రతి బడ్జెట్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర బీజేపీ నేతలు స్పందించరు. నిర్మాలా సీతారామన్ రూ.53,47,315 కోట్లతో ప్రవేశపెట్టిన 2026– 27 బడ్జెట్ తెలంగాణనే కాదు యావత్ దేశ ప్రజలను తీవ్ర నిరాశపర్చింది. ఈ బడ్జెట్లో ప్రజల అవసరాలను తీర్చడంతోపాటు వారి సమస్యలు చక్కదిద్దే ప్రయత్నమే చేయలేదు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కొన్ని నిమిషాల్లోనే స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవడమే బడ్జెట్ ఎంత పేలవంగా ఉందో చెప్పడానికి నిదర్శనం.
రాజకీయాలకే కేంద్రం ప్రాధాన్యత
ఆదాయ పన్నుపై ఆశగా ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద ప్రజల సంక్షేమానికి ప్రత్యేక కేటాయింపులు లేవు. గత యూపీఏ హయాంలో 7.5 శాతంగా ఉన్న ఉత్పాదకత వృద్ధి ఇప్పుడు 3.5 శాతానికి పరిమితమైంది. యూపీఏ పాలనలో తయారీ రంగం వృద్ధి 7.4 శాతం ఉండగా, ఇప్పుడు 3.54 శాతానికి పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 92కు పడిపోయినా చక్కదిద్దే ప్రయత్నాలు చేయలేదు. యూపీఏ హయాంలో ప్రజలకు వరంలా ఉన్న ఎంజీఎన్‌ఆర్ఈజీఏ చట్టంలో మార్పు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలపై భారం మోపిన మోదీ ప్రభుత్వం బడ్జెట్లో స్వాంతన చేకూర్చే ప్రయత్నం చేయలేదు. ‘వికసిత్ భారత్’ ప్రచారం చేస్తున్న మోదీ ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంగా దూసుకుపోతున్న రాష్ట్రంపై మరోసారి వివక్ష చూపింది. అన్ని రాష్ట్రాలు సమానంగా అభివృ ద్ధి సాధిస్తేనే ‘వికసిత్ భారత్’ సాధ్యమనే అంశాన్ని కేంద్రం విస్మరిస్తూ స్వార్థ రాజకీయాలకే ప్రాధాన్యతిస్తోంది. సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాల అభివృ ద్ధికి సహకరించకుండా ‘వికసిత్ భారత్’ ఎలా సాధ్యమో కేంద్ర పెద్దలకే తెలియాలి. రాజకీయ కక్షతో తెలంగాణకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నడూ క్షమించరు. తెలంగాణపై పక్షపాతం చూపిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు తగిన సమయంలో బుద్ధిచెప్పడం ఖాయం. బడ్జెట్లో తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న వివక్షను రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఎండగట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
తెలంగాణకు అన్యాయం
రాష్ట్రంలో విమానాశ్రయాల నిర్మాణాలను పట్టించుకోలేదు. బడ్జెట్ పై తెలంగాణ ప్రభుత్వం పెట్టుకున్న ఆశలను కేంద్రం అడియాసలు చేసింది. రాష్ట్రం కోరిన కీలక ప్రాజెక్టులకు కేటాయింపులు చేయకుండా రిక్తహస్తం చూపింది. ఆర్‌ఆర్‌ఆర్ రోడ్డు, మెట్రో రైలు, మూసీ ప్రాజెక్టు ఇలా వేటికీ నిధులు కేటాయించలేదు. బయో, ఫార్మారంగంలో, సెమీ కండక్టర్ పరిశ్రమలో తెలంగాణను విస్మరించారు. ప్రత్యేక సంస్కృతి, చారిత్రాత్మక ప్రాంతాలకు ప్రసిద్ధమైన తెలంగాణకు టూరిజం నిధులు కేటాయించలేదు. సింగరేణి గనులున్న తెలంగాణలో రేర్ ఎర్త్ ఖనిజాలపై దృష్టి పెట్టలేదు. రాష్ట్ర విభజన చట్టం హామీలైన బయ్యారం స్టీల్ ప్లాంట్, నవోదయ పాఠశాలలు, ఐఐఎం ఊసే ఎత్తలేదు. హైదరాబాద్ నుంచి పుణే, బెంగళూర్, చెన్నై నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్లు ప్రకటించినా రాష్ట్రం కోరినట్టు కొత్త రైల్వే లైన్లను విస్మరించారు. దేశ ఆర్థికప్రగతికి తోడ్పడుతున్న తెలంగాణకు నిధులు పంపిణీలో అన్యాయం జరుగుతోంది. సంపద సృ ష్టిలో, పన్నుల వసూళ్లలో ముందున్న రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి చూపుతోంది. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5.01 శాతం. ఈ లెక్కన కేంద్రం నుంచి రూ.3.76 లక్షల కోట్లు దక్కాల్సి ఉన్నా, గడిచిన ఐదేండ్లలో రూ.1.84 లక్షల కోట్లు అంటే 2.45 శాతం మాత్రమే రావడంతో తెలంగాణ రూ.1.92 లక్షల కోట్లు నష్టపోయింది.
- బి.మహేశ్ కుమార్ గౌడ్,
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు
