మానవ జీవనంలో ఆరోగ్యం అత్యంత మౌలికమైన అవసరం. ఆ ఆరోగ్యాన్ని కాపాడే వైద్యవృత్తి కేవలం ఉపాధి కాదు. అది ఒక నిబద్ధత, ఒక మానవీయ బాధ్యత. ఈ బాధ్యతను నిశ్శబ్దంగా, నిరంతరంగా నిర్వర్తిస్తూ భారత ఆరోగ్య వ్యవస్థకు వెన్నెముకలా నిలుస్తున్నవారు మహిళా వైద్యులు. ఈ నిశ్శబ్ద సేవకుల కృషిని గుర్తించేందుకే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 3న జాతీయ మహిళా వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ తేదీ ప్రపంచంలో తొలి మహిళా వైద్యురాలిగా గుర్తింపు పొందిన డాక్టర్ ఎలిజబెత్ బ్లాక్‌వెల్ జన్మదినం కావడం విశేషం. ఇది మహిళా వైద్యుల పోరాట చరిత్రకు ఒక అంతర్జాతీయ గుర్తింపును అందిస్తుంది. భారతదేశంలో మహిళలు వైద్యరంగంలోకి అడుగుపెట్టిన చరిత్ర సులభమైనది కాదు. మహిళలకు విద్యనే అనవసరమని భావించిన కాలంలో వైద్యవిద్య వంటి కఠినమైన రంగంలో ప్రవేశించడం సామాజిక విప్లవానికి సమానమే. 19వ శతాబ్దం చివర్లో ఆనంది గోపాల్ జోషి, కడంబినీ గంగూలీ వంటి మహిళలు వైద్యవిద్యను అభ్యసించి వైద్యులుగా నిలవడం చరిత్రాత్మకం.
పెరిగిన మహిళా వైద్యుల ప్రాతినిధ్యం
నేటి భారతదేశ వైద్యరంగంలో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగింది. నేషనల్ మెడికల్ కమిషన్ గణాంకాల ప్రకారం, మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల్లో సుమారు సగం మంది మహిళలే. కొన్ని రాష్ట్రాల్లో ఈ సంఖ్య 55 శాతాన్ని దాటడం, వైద్యవిద్యలో మహిళల ఆధిక్యతను స్పష్టంగా సూచిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులలో మహిళల వాటా గత రెండు దశాబ్దాల్లో రెట్టింపు కావడం కూడా గమనార్హం. అయినప్పటికీ వైద్య పరిపాలనలో మహిళల స్థానం ఇంకా బలహీనంగానే ఉంది. నిర్ణయాధికార స్థానాల్లో పురుషాధిక్యత కొనసాగుతూనే ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 గణాంకాలు మహిళా వైద్యుల సేవల ప్రభావాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. మాతృ, శిశు మరణాల రేటు తగ్గుదలలో మహిళా వైద్యులు కీలక పాత్ర పోషించారు. 2000లో ప్రతి లక్ష ప్రసవాలకు 370గా ఉన్న మాతృ మరణాల రేటు, 2019–21 నాటికి 97కి తగ్గడం వెనుక మహిళా వైద్యులు, నర్సులు, ఆశా కార్యకర్తల కృషి ఉంది.
సేవా స్ఫూర్తికి ప్రతిరూపాలు
కొవిడ్ ఫ్రంట్‌లైన్ వర్కర్లలో దాదాపు 60 శాతం మహిళలే ఉండటం భారత ఆరోగ్యవ్యవస్థలో వారి కీలకపాత్రను చాటింది. కుటుంబానికి దూరంగా ఉంటూ, ప్రాణభయాన్ని కూడా లెక్కచేయకుండా, రాత్రింబవళ్లు ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తించిన మహిళా వైద్యులు సేవాస్ఫూర్తికి ప్రతిరూపాలుగా నిలిచారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, కొవిడ్ కాలంలో పనిచేసిన మహిళా వైద్యుల్లో సుమారు 35శాతం మంది తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వారు విధుల నుంచి తప్పుకోలేదు. ఇది వారి వృత్తి నిబద్ధతను ప్రతి బింబిస్తుంది. అయితే మహిళా వైద్యుల ప్రయాణం సవాళ్లతో నిండినదే. లింగ వివక్ష, పని ప్రదేశాల్లో భద్రతా సమస్యలు, రాత్రి విధులు, వృత్తి–కుటుంబ సమతుల్యత వంటి అంశాలు వారికి ప్రధాన అడ్డంకులుగా మారుతున్నాయి. గర్భధారణ, మాతృత్వ దశలో అనుకూల విధానాలు లేకపోవడం వల్ల కొంతమంది మహిళలు వైద్యవృత్తి నుంచి దూరమవుతున్నారు. కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం, మెడికల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళల్లో సుమారు ఐదవ వంతు మంది యాక్టివ్ ప్రాక్టీస్‌కు దూరమవడం దేశానికి మానవ వనరుల నష్టంగా మారుతోంది.
మహిళా వైద్యుల సేవలను గౌరవించాలి
నేషనల్ మెడికల్ కమిషన్ గణాంకాల ప్రకారం, ఉన్నత పరిపాలనా హోదాల్లో మహిళల వాటా 15 శాతంలోపే ఉంది. పట్టణాల్లో అవకాశాలు పెరిగినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో మహిళా వైద్యుల లభ్యత తక్కువగానే ఉంది. భద్రతా లోపాలు, మౌలిక వసతుల కొరత, కుటుంబ సహకారం లేకపోవడం ఇందుకు కారణాలుగా మారుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వాలు గ్రామీణ సేవలకు మహిళా వైద్యులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. అనేక గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళా వైద్యుల నియామకం వల్ల సేవల నాణ్యత మెరుగుపడినట్లు ప్రభుత్వ నివేదికలు సూచిస్తున్నాయి. మహిళా వైద్యుల సేవలను గౌరవించడమే కాకుండా, వారి సమస్యలకు స్పష్టమైన పరిష్కారాలు చూపాల్సిన బాధ్యత సమాజంపై ఉంది.
- రామకిష్టయ్య సంగనభట్ల,
సీనియర్
ఇండిపెండెంట్ జర్నలిస్ట్
