ఫైనల్ బెర్తు ఎవరిదో..? ఇవాళ (ఫిబ్రవరి 3) గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఢిల్లీ మధ్య ఎలిమినేటర్ పోరు

ఫైనల్ బెర్తు ఎవరిదో..? ఇవాళ (ఫిబ్రవరి 3) గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఢిల్లీ మధ్య ఎలిమినేటర్ పోరు

వడోదర: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) నాలుగో సీజన్ కీలక ఘట్టానికి చేరుకుంది. మంగళవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఢిల్లీ క్యాపిటల్స్,  గుజరాత్ జెయింట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గెలిచిన టీమ్ గురువారం జరిగే ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యంత నిలకడైన జట్టుగా పేరున్న ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా నాలుగో ఏడాది ప్లేఆఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించింది. గత మూడు సీజన్లలో ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరి రన్నరప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచిన ఢిల్లీ ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలనే పట్టుదలతో ఉంది. 

బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లారా వోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వార్ట్ (241 రన్స్), లిజెల్లీ లీ (240) టాపార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలకడగా రాణిస్తున్నారు. గత మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ జట్టుకు అదనపు బలం. అయితే, ఓపెనర్ షెఫాలీ వర్మ  ఫామ్ జట్టును కొంత ఆందోళన పరుస్తోంది. బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యంగ్ పేసర్ నందిని శర్మ (14 వికెట్లు) డెత్ ఓవర్లలో అద్భుతంగా రాణిస్తోంది. 

ఆమెకు తోడుగా స్పిన్నర్ శ్రీచరణి (14 వికెట్లు), మరిజేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాప్ (10 వికెట్లు) ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకోవైపు లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్యలో మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత వరుసగా మూడు విజయాలతో గుజరాత్ జెయింట్స్ అద్భుతంగా పుంజుకుంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సాధించిన చారిత్రాత్మక విజయం ఆ టీమ్ కాన్ఫిడెన్స్‌‌ను డబుల్ చేసింది.

ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అద్భుత ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న సోఫీ డివైన్, 17 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉంది. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ 237 రన్స్ చేసిన ఆమెపై ఈ పోరులో జీటీ భారీ అంచనాలు పెట్టుకుంది. కెప్టెన్ ఆష్లే గార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్, బెత్ మూనీ వంటి అనుభవజ్ఞులతో పాటు జార్జియా వారెహమ్ మెరుపు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కలిసివచ్చే అంశాలు. లీగ్ దశలో ఢిల్లీపై ఆడిన రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లోనూ నెగ్గడం గుజరాత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం.