- డెడ్‌బాడీని ట్రేస్ చేసిన పోలీసులు
- నెలకు లక్ష జీతం తీసుకుంటున్న యువతి
- సూసైడ్ ఎలా చేసుకోవాలని ల్యాప్‌టాప్‌లో సెర్చ్
ట్యాంక్‌బండ్, వెలుగు: తాను పెండ్లి చేసుకొని వెళ్లిపోతే తన తల్లిని చూసుకునే వారు ఎవరూ ఉండరనే ఆలోచనతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది. ఆదివారం హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న యువతిని పోలీసులు సోమవారం ట్రేస్ అవుట్ చేశారు. లేక్ ఇన్స్పెక్టర్ ఆర్. వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ బైంసాకు చెందిన విజయలక్ష్మి (26) తన తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి కూకట్‌పల్లిలోని మోతి నగర్లో అద్దెకు ఉంటోంది. ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ నెలకు లక్ష రూపాయల జీతం తీసుకుంటోంది.
తల్లి పూర్తిగా అనారోగ్యంతో ఉండడంతో ఆమె బాగోగులు చూసుకుంటోంది. కజిన్ బ్రదర్స్ వీరికి అండగా ఉంటూ విజయలక్ష్మికి పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. దీంతో “నేను పెండ్లి చేసుకుని వెళ్లిపోతే తల్లికి చాలా ఇబ్బంది అవుతుంది” అనే ఆలోచనతో ఆమె అనేకసార్లు మదన పడేదని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో ఏం చేయాలో తెలియక తన ల్యాప్‌టాప్‌లో “ఆత్మహత్య ఎలా చేసుకోవాలి” అని సెర్చ్ చేసింది.
జనవరి 31న రాపిడో టూ వీలర్ బుక్ చేసుకుని మధ్యాహ్నం 12:30 గంటలకు ట్యాంక్ బండ్ చేరుకుని అన్నమయ్య విగ్రహం వద్ద హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె కజిన్బ్రదర్స్ కూకట్‌పల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, డెడ్‌బాడీని ట్రేస్ చేశారు. ల్యాప్‌టాప్‌లో ఆత్మహత్య ఎలా చేసుకోవాలనే సెర్చ్ కనిపించినట్లు లేక్ పోలీసులు తెలిపారు. తల్లి అనారోగ్యం, పెండ్లి సంబంధాలు మానసిక బాధతో విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
