టెక్ బ్యాగ్రౌండ్ లేనోళ్లకీ ఐటీ జాబ్స్.. కాగ్నిజెంట్ నయా రిక్రూట్మెంట్ ప్లాన్..!

టెక్ బ్యాగ్రౌండ్ లేనోళ్లకీ ఐటీ జాబ్స్.. కాగ్నిజెంట్ నయా రిక్రూట్మెంట్ ప్లాన్..!

ఒకపక్క ప్రపంచ వ్యాప్తంగా ఐటీ, టెక్నాలజీ కంపెనీల్లో ఏఐ ప్రభావంతో లేఆఫ్స్ కొనసాగుతుంటే.. ఐటీ సేవల కంపెనీలు మాత్రం కొత్త ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు వరుస ప్రకటనలు చేస్తున్నాయి. ఏఐ వల్ల భయపడుతున్న చాలా మందికి ఒకేసారి ఈ రెండు ప్రకటనలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు. ఏఐ రాకతో ప్రధానంగా మిడ్ లెవెల్, సీనియర్ టెక్ ఉద్యోగులు ప్రభావితం అవుతున్న సంగతి తెలిసిందే. కానీ కొత్తగా కంపెనీలు ఆఫర్ చేస్తున్న జాబ్స్ ఏంటో కూడా తెలుసుకోవటం ముఖ్యం. 

తాజాగా ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ 2025లో ఎంట్రీ-లెవెల్ టాలెంట్ నియామకాలను విస్తరించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆర్ట్స్ విద్యార్థులను కూడా ఆకర్షించడంపై దృష్టి పెట్టింది కంపెనీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ సామర్థ్యాన్ని పెంపొందించటానికి సహాయకారిగా ఉంటుందని సీఈవో రవి కుమార్ ఉన్నారు. 

అఆ టూల్స్ వల్ల నైపుణ్యాలు కొద్దిరోజుల్లో అభివృద్ధి సాధించవచ్చని, తక్కువ అనుభవం ఉన్నవారికి కూడా పెద్ద స్థాయిలో ప్రాజెక్టుల్లో పనిచేయడానికి అవకాశాలు ఉంటాయని రవి కుమార్ చెప్పారు. ఈ నేపథ్యంలో కాగ్నిజెంట్ ఇప్పటివరకు సినీ, సోషల్ సైన్స్, మానసిక శాస్త్రం, జర్నలిజం వంటి వృత్తులు అంటే నాన్-టెక్ విద్యార్థులను కూడా నియమించుకుంటోంది. ఈ విధానం ద్వారా సాంకేతిక నైపుణ్యాలు అలవాటు చేసుకుని, సమస్యలు గుర్తించే, సృజనాత్మకంగా ఆలోచించే, వ్యూహాత్మకంగా సమస్యలను పరిష్కరించే టీమ్స్ సిద్ధం చేయటం సాధ్యమవుతుందని చెప్పారు. ఉదాహరణకు బయాలజీ విద్యార్ధులు AI సహాయంతో మందుల అభివృద్ధి వేగవంతం చేయవచ్చని సీఈవో అన్నారు. 

►ALSO READ | భారతీయులు చేస్తున్న అతిపెద్ద ఆర్థిక తప్పులు.. ఆవిరైపోతున్న సంపదను ఆపండిలా..

ఇక డిజిటల్ నైపుణ్యాలు ఉండే వారు మరింత ముందుకు పోయే అవకాశం ఉందని, డిజిటల్ నైపుణ్యంలో తేడాలు సామాజిక విభజనను కలిగించడాన్ని రవి కుమార్ వ్యాఖ్యానించారు. కాగ్నిజెంట్ అప్రెంట్షిప్ కార్యక్రమాలు, మిడ్కేరియర్ ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేక భాగస్వామ్యాలు కూడా నిర్వహిస్తోంది. మెుత్తానికి కంపెనీ గతంలో మాదిరిగా కేవలం కంప్యూటర్ సైన్స్ విద్యార్థులను మాత్రమే కాకుండా వివిధ రంగాల నుంచి యువతకు ఐటీ సేవల రంగంలో అవకాశాలు కల్పించాలని చూస్తోంది.