తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్' సీజన్ 9 క్లైమాక్స్‌కు చేరుకుంది. గత వంద రోజులకు పైగా ఉత్కంఠభరితమైన టాస్క్‌లు, గొడవలు, ఎమోషన్స్, అనూహ్య మలుపులతో సాగిన ఈ ప్రయాణం రేపు (ఆదివారం) జరగబోయే గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది. పండగ వాతావరణాన్ని తలపించే ఈ వేడుక కోసం ప్రేక్షకులు కోటి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి!
ఈ సీజన్ ఫినాలేకు అతిపెద్ద ఆకర్షణ మెగాస్టార్ చిరంజీవి. గతంలో అల్లు అర్జున్ వస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. కొన్ని కారణాలతో ఆయన రావడం కుదరలేదు. దీంతో మేకర్స్ ఈసారి మెగాస్టార్‌ను రంగంలోకి దించారు. చిరంజీవి తనదైన శైలిలో వేదికపై సందడి చేయడమే కాకుండా, విన్నర్ ట్రోఫీని విజేతకు అందజేయనున్నారు. మరో విశేషమేమిటంటే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , గ్లోబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ వేదికపై అతిథులుగా మెరిసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే, బిగ్ బాస్ చరిత్రలోనే ఇది బిగ్గెస్ట్ ఫినాలే కానుంది.
హౌస్‌లోకి తారల సందడి
శనివారం ఎపిసోడ్‌లోనే ఫినాలే సందడి మొదలైపోయింది. 'సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' మూవీ టీమ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్లతో సరదాగా గడిపారు. అలాగే అందాల భామ నిధి అగర్వాల్ హౌస్‌లోకి ప్రవేశించి టాప్-5 కంటెస్టెంట్లకు ప్రత్యేక టాస్కులు ఇచ్చి ఉత్సాహపరిచింది. ఇక ప్రముఖ యాంకర్లు శ్రీముఖి, ప్రదీప్ మాచిరాజు వినోదాత్మక టాస్కులతో ఇంటి సభ్యులకు ఆఫర్లు ఇస్తూ రక్తికట్టించారు. ఫినాలే కు పాపులర్ హీరోయిన్ల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు ఈ ఈవెంట్‌కు గ్లామర్ అదనపు హంగులు అద్దనున్నాయి.
టాప్-5 కంటెస్టెంట్ల భావోద్వేగ ప్రయాణం
ఈ వారం మొత్తం బిగ్ బాస్ ఎటువంటి కఠినమైన టాస్క్‌లు ఇవ్వకుండా, కంటెస్టెంట్ల జర్నీ వీడియోలను (AV) ప్రదర్శించారు. వరుసగా.. కళ్యాణ్ పడాల, తనూజ పుట్టుస్వామి, ఇమ్మానుయేల్, డీమాన్ పవన్ సంజన ఏవీలను చూపించారు. తమ 100 రోజుల ప్రయాణాన్ని తెరపై చూసుకుంటూ కంటెస్టెంట్లు కన్నీటి పర్యంతమయ్యారు. వారి కష్టనష్టాలు, గెలుపు ఓటములను చూసి ప్రేక్షకులు కూడా ఎమోషనల్ అయ్యారు.
విన్నర్ ఎవరు?
ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, టైటిల్ రేసులో కళ్యాణ్ పడాల ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. తనదైన ఆటతీరుతో, హుందాతనంతో భారీగా ఓట్లను కొల్లగొట్టిన కళ్యాణ్ విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయనకు గట్టి పోటీ ఇచ్చిన తనూజ పుట్టుస్వామి రన్నరప్‌గా నిలిచే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, బిగ్ బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. హోస్ట్ నాగార్జున అధికారికంగా ప్రకటించే వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.
ఒక సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరిని కట్టిపడేసిన బిగ్ బాస్ 9 ప్రయాణం ముగింపు దశకు వచ్చింది. మరి ఆ మెరిసే ట్రోఫీని, భారీ నగదు బహుమతిని ఎవరు సొంతం చేసుకుంటారు? మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆ అదృష్టం ఎవరిని వరిస్తుంది? అన్నది తెలియాలంటే ఆదివారం సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.
