ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ ఐపీఎల్ మినీ వేలంలో రూ.8.2 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోవడంతో తన రూట్ మార్చుకున్నాడు. ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ ముందు నాలుగు మ్యాచ్ లే ఆడతానని చెప్పిన ఈ ఆసీస్ క్రికెటర్.. ఇప్పుడేమో మరో మాట చెప్పి ఆశ్చర్యానికి గురి చేశాడు. ఐపీఎల్ 2026లో తాను ఏప్రిల్ 18 తర్వాత అందుబాటులో ఉంటానని కన్ఫర్మ్ చేశాడు. తన వివాహం ముగిసిన వెంటనే జట్టులో చేరతానని తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఐపీఎల్ కోసం ఇంగ్లిస్ తన హనీమూన్ ప్లాన్స్ ను వాయిదా వేసుకున్నట్టు సమాచారం.ఏప్రిల్ 18న వివాహం తర్వాత వెంటనే ఐపీఎల్ ఆడడం కోసం లక్నో సూపర్ జయింట్స్ జట్టులో చేరనున్నాడు.
ఇంగ్లిస్ నిర్ణయంతో పంజాబ్ ఫ్రాంచైజీ షాక్ కు గురైంది. ఈ ఆసీస్ వికెట్ కీపర్ ఐపీఎల్ నాలుగు మ్యాచ్ లే ఆడతానని చెప్పడంతో పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకోకుండా రిలీజ్ చేసింది. మినీ ఆక్షన్ లో ఇంగ్లిస్ కు ఊహించని ధర లభించింది. మంగళవారం (డిసెంబర్ 16) అబుదాబి వేదికగా జరిగిన ఆక్షన్ లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ ను రూ. 8.60 కోట్ల ధరకు లక్నో సూపర్ జయింట్స్ సొంతం చేసుకుంది. మినీ ఆక్షన్ లో ఈ ఆసీస్ బ్యాటర్ రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్ తో ఆక్షన్ లో వచ్చాడు. ఇంగ్లిస్ పై చాలా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించకపోయినా లక్నో మాత్రం ఈ ఆసీస్ స్టార్ కావాలనుకుంది
ఐపీఎల్ 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుతంగా ఆడిన జోష్ ఇంగ్లిస్ ను రిటైన్ చేసుకోలేదు. బుమ్రా బౌలింగ్ లో సిక్సర్లు బాది కొట్టి ఆధిపత్యం చూపించినా.. కొన్ని మ్యాచ్ ల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లు ఆడినా ఇంగ్లిస్ ను రిలీజ్ చేయడానికి కారణం లేకపోలేదు. ఐపీఎల్ 2026 లో ఇంగ్లిస్ కేవలం 25 శాతం లేదా దాదాపు నాలుగు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటానని బీసీసీఐకి తెలిపాడు. ఐపీఎల్ సమయంలో తన వివాహం ఉన్న కారణంగా అన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉండనని ముందే ధృవీకరించాడు. అయితే లక్నో 8.60 కోట్ల ధరకు దక్కించుకోవడంతో డబ్బు కోసం తన మనసు మార్చుకున్నాడు.
ఐపీఎల్ 2025 సీజన్ లో ఇంగ్లిస్ పంజాబ్ కింగ్స్ తరపున ఆడి తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. 11 మ్యాచ్ ల్లో 278 పరుగులు చేసి టాప్ ఆర్డర్ లో జట్టుకు కీలక ప్లేయర్ గా మారాడు. ముఖ్యంగా ప్లే ఆఫ్స్ లో ముంబైపై ఆడిన ఇన్నింగ్స్ హైలెట్ గా నిలిచింది. క్వాలిఫయర్ 2 లో ముంబైపై మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగి 42 బంతుల్లో 73 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో ఈ ఆసీస్ బ్యాటర్ ను రూ 2.06 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.
