న్యూఢిల్లీ: 2026 టీ20 వరల్డ్ కప్ కోసం ప్రకటించిన టీమిండియా స్క్వాడ్‌లో యువ వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషాన్ స్థానం సంపాదించాడు. బీసీసీఐ శనివారం (డిసెంబర్ 20) ప్రకటించిన 15 మంది స్క్వాడ్‌లో కిషాన్‌కు చోటు దక్కింది. సౌతాఫ్రికా సిరీస్ ముందు వరకు కిషాన్ వరల్డ్ కప్ సన్నాహాల్లో లేకపోయినప్పటికీ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా ఆడి జట్టులోకి వచ్చాడు. ఈ టోర్నీలో పరుగుల వరద పారించడంతో పాటు కెప్టెన్‌గా జార్ఖండ్‌కు ముస్తాక్ అలీ ట్రోఫీ అందించాడు.
తద్వారా తనలో ఏ మాత్రం సత్తా తగ్గలేదని సెలెక్టర్లకు మెసేజ్ పంపాడు. దీంతో 2023 నవంబర్‌లో చివరిసారి టీమిండియా తరపున ఆడిన ఈ జార్ఖండ్ వీరుడు రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్‌కు టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కడంపై అతని తల్లి భావోద్వేగానికి గురయ్యారు.
శనివారం (డిసెంబర్ 20) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దేవుడు ఒక తల్లి ప్రార్థనలు విన్నాడు. దేవుడు ఇషాన్ కష్టాన్ని చూశాడు’’ అని ఆమె ఎమోషనల్ అయ్యారు. వ్యక్తిగత సమస్యలతో అంతర్జాతీయ జట్టుకు దూరమైన తన కొడుకు తిరిగి టీమిండియా తరుఫున ఆడాలని దేవున్ని ప్రార్థించానని ఆమె తెలిపారు.
దేవుడు నా ప్రార్థనలు విని నా కుమారుడికి టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కేలా చేశాడని అన్నారు. మరోవైపు టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక కావడంపైన ఇషాన్ కిషన్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు. జాతీయ జట్టులోకి తిరిగి రావడంతో పాటు వరల్డ్ కప్‌కు సెలక్ట్ అవ్వడం హ్యాపీగా ఉందన్నారు. వరల్డ్ కప్ కు ఎంపికైనట్లు తెలియగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని తెలిపారు.
వరల్డ్ కప్ కు టీమిండియా స్క్వాడ్:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్ టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా, జస్ప్రీత్ బుమ్రా
