కాల దేవాలయం.. విజయపురిలో అభివృద్ది.. స్ఫూర్తితో వెలిసిన గుడి

కాల దేవాలయం.. విజయపురిలో అభివృద్ది..  స్ఫూర్తితో వెలిసిన గుడి

విజయపురిలో పచ్చని చెట్లు, మంచి ఇళ్ళు, మరికొంత దూరంలో కర్మాగారాలు అలా ఎటుచూసినా ఆ ఊరిలో అభివృద్ధి కనబడుతుంది. ఆ ఊరిని గురించి విన్న చక్రపాణి ఆ అభివృద్ధికి కారణాలు తెలుసుకోవాలి అనుకున్నాడు. ఓ ఆదివారం విజయపురం వెళ్లాడు. ఊరిలోకి వెళుతూనే అక్కడి రహదారులు,పచ్చని చెట్లు, తోటలు ఎంతో ఆకర్షించాయి! 

ఊరిలో ఎక్కడా చెత్త కుప్పలు కనబడలేదు. రోడ్ల మీద మురుగునీటి పారుదల కనబడలేదు.ఎవరినైనా పలకరిస్తే నమ్రతగా జవాబులు చెప్తున్నారు. ఓ అరవై ఏళ్ల పెద్దాయన కనబడితే ‘‘ఈ ఊరి గురించి కొంచెం చెప్తారా?” అని అడిగాడు చక్రపాణి.ఆ పెద్దాయన చిరునవ్వుతో ఈ విధంగా చెప్పాడు.. 

‘‘నాయనా శ్రమ జీవి అంటే ఎవరు? సమయాన్ని వృథా చేయకుండా కష్టపడేవాడు. ప్రజలందరూ సమయాన్ని సద్వినియోగం చేస్తూ కష్ట పడటం వల్ల ఈ  విజయపురం అనేక విధాలుగా బాగు పడింది ఊరికి మంచి పేరు వచ్చింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ఊరు బద్ధకస్తుల నిలయం. అసలు కష్ట పడేవారు కాదు! కొన్ని విలాసాలు, నిద్ర పోవడంలో వారి జీవితాలు గడచి పోయేవి. అందువల్ల ఊరిలో ఏమాత్రం అభివృద్ధి లేదు. ఇలా ఉండగా ఈ ఊరికి గంగాధరుడు అనే యోగి వచ్చి ప్రజల సోమరితనాన్ని గమనించి  వారిని మార్చి ఊరు అభివృద్ధి చూడాలనుకున్నాడు. 

ఊరి మధ్యలో ఉన్న మంటపంలో కూర్చుని పాటలు పాడుతూ కొందరిని ఆకర్షించాడు. తరువాత ప్రజలను చైతన్యపరచి స్ఫూర్తి నింపే మంచి కథలను చెప్ప సాగాడు. ఆ కథలు అందరినీ ఎంతో ఆకర్షించి వారు వారి పిల్లలకు కథల్ని చెప్పసాగారు. కథల్లో జీవిత సత్యాలు, జీవితాన్ని ఏవిధంగా అత్యుత్తమంగా మలచుకోవాలి వంటి మంచి విషయాలు ఉండేవి. ఆ విషయాలు పాటించడం వల్ల కొందరు బద్ధకం వదలి బాగుపడ్డారు.


ఆవిధంగా కొందరు తోటల పెంపకం, వెదురుతో బుట్టలు అల్లడంలో కృషి చేసి డబ్బు సంపాదించారు.  మిగతా వారిలో స్ఫూర్తి నింపారు. వారందరూ గంగాధరుణ్ణి కలసి కృతజ్ఞతలు తెలియజేశారు.అప్పుడు ఆయన, ‘‘మీలో వచ్చిన మార్పు నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మరి మన తరువాత తరాల్లోని వారు కూడా స్ఫూర్తి పొందాలంటే మనం ఒక దేవాలయం కట్టాలి” అని చెప్పారు గంగాధరం.ఆయన మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. అయినా ఆయన మాటల్లో ఏదో మేలు చేసే భావన ఉంటుందని అందరూ ఒప్పుకున్నారు. ఊరులో తూర్పున ఉన్న ఖాళీ స్థలంలో గుడి కట్టాలని ప్రతిపాదించారు. అందరూ ఏ దేవుడిని గుడిలో ప్రతిష్ఠిద్దామని గంగాధరుణ్ణి అడిగారు.

‘‘నాయనలారా మీ మంచి ఆలోచనలతో సమయ సద్వినియోగంతో ప్రయోజకులయ్యారు. అందుకే మనం కట్టబోయే దేవాలయం ‘కాల దేవాలయం’ అని చెప్పారు. వారు ఒకింత ఆలోచించిన తరువాత గంగాధరుడు చెప్పిన విషయంలో సూక్ష్మం బోధపడింది. ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరూ తమ శక్తి మేర ధన, శ్రమలు చేసి మంచి శిల్పులను రప్పించి అద్భుత దేవాలయం కట్టించారు. 

దేవాలయ ప్రాంగణంలో అన్ని దేవుళ్ల విగ్రహాలు పెట్టించారు. కానీ మూల విరాట్టు స్థానంలో మటుకు నగిషీలతో నిండి ఉన్న ఓ పెద్ద రాతి గడియారాన్ని ప్రతిష్ఠించారు. దేవాలయం గోడల మీద కాల సద్వినియోగం గురించి అనేక సూక్తులు రాయించారు. ఆ దేవాలయాన్ని చూడటానికి అనేక మంది ఇతర రాష్ట్రాల వారు కూడా వచ్చి కాల సద్వినియోగాన్ని గురించి తెలుసుకుని స్ఫూర్తి పొందారు. కాలం సద్వినియోగం చెయ్యకపోతే పోయిన కాలం సంపాదించలేము. అభివృద్ధి ఉండదు. అలా ఆ ఊరు అభివృద్ధి చెందడానికి గల కారణాలను చక్రపాణికి ఆ పెద్దాయన వివరించాడు. చక్రపాణి ఆయనకు నమస్కారం పెట్టి అటువంటి స్ఫూర్తి తన ఊరువారిలో నింపాలనే మంచి ఆలోచనతో వెళ్లిపోయాడు.

–కంచనపల్లి వేంకట కృష్ణారావు–