2026 టీ20 వరల్డ్ కప్ కు టీమిండియా యువ ఓపెనర్ శుభమాన్ గిల్ పై వేటు పడింది. ఫామ్ లేక ఇబ్బందిపడుతున్న గిల్ పై సెలక్టర్లు ఎట్టకేలకు జట్టు నుంచి తప్పించారు. ఆసియా కప్ 2025 నుంచి గిల్ ను బలవంతంగా ఓపెనర్ గా కొనసాగించారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇటీవలే సౌతాఫ్రికా సిరీస్ లలో విఫలమైనప్పటికీ గిల్ కు వరుస ఛాన్స్ లు ఇచ్చారు. శాంసన్ లాంటి ఆటగాడిని తప్పించి గిల్ ను జట్టులో కొనసాగించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నమ్మకంతో ఎన్ని అవకాశాలు ఇచ్చినా గిల్ విఫలమవుతూ జట్టుకు భారంగా మారాడు.
వైస్ కెప్టెన్ గా గిల్ జట్టులో కొనసాగడంతో అతన్ని తప్పించలేని పరిస్థితి. శుభమాన్ ను వరల్డ్ కప్ నుంచి ఎందుకు తప్పించారో టీంఇండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వివరణ ఇచ్చారు. గిల్ ను తప్పించడంపై ఇద్దరూ వేరు వేరు కారణాలు చెప్పారు. కెప్టెన్ సూర్య మాట్లాడుతూ.. "మాకు ఓపెనర్ గా వికెట్ కీపర్ ఉంటే బాగుందని భావించాం. కిషన్ వికెట్ కీపర్ తో పాటు ఓపెనర్ గా చేయగలడు". అని సూర్య అన్నాడు.
అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. "గిల్ ఎలాంటి క్వాలిటీ ప్లేయర్ అనే విషయం మనకు తెలుసు. కానీ అదే సమయంలో అతను పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. దురదృష్టవశాత్తు చివరి వరల్డ్ కప్ లోనూ గిల్ కు స్థానం దక్కలేదు. అప్పుడు వేరు వేరు కాంబినేషన్ లతో వెళ్లాల్సి వచ్చింది. 15 మంది స్క్వాడ్ లో ఎవరో ఒకరు మిస్ అవ్వాలి. ఈ సారి గిల్ వంతు వచ్చింది". అని అగార్కర్ చెప్పుకొచ్చారు.
టీ20 వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న శుభ్‌మన్ గిల్ ఫామ్ ఇండియాను కలవరపెడుతోంది. ఆసియా కప్ నుంచి గమనిస్తే గిల్ ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయారు. కాన్‌బెరాలో తొలి టీ20లో మాత్రమే కెప్టెన్ సూర్యతో కలిసి కాస్త మెప్పించాడు. ఆ తర్వాత నాలుగో వన్డేలో 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కేవలం 4 పరుగులే చేసి పెవిలియన్ కు చేరాడు. అడపాదడపా ఇన్నింగ్స్ లు తప్పితే గిల్ పెద్దగా రాణించడం లేదు.
గిల్ చివరి 15 ఇన్నింగ్స్ లు చూసుకుంటే 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(0), 28(28) ఇలా ఉన్నాయి. కేవలం 3 సార్లు మాత్రమే 30 పరుగుల మార్క్ అందుకున్నాడు. సౌతాఫ్రికాపై జరిగిన రెండో టీ20లో తొలి బంతికే డకౌటయ్యాడు. మూడో టీ20లో 28 పరుగులు చేసినా 28 బంతులు తీసుకున్నాడు. దీంతో గిల్ స్థానంలో శాంసన్ కు ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్స్ గట్టిగా వినిపించాయి.
