2026 టీ20 వరల్డ్ కప్ కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ శనివారం (డిసెంబర్ 20) ప్రకటించింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన ఏ స్క్వాడ్ లో కొన్ని అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు కెప్టెన్సీ చేయనున్నాడు. ఫామ్ లో లేని గిల్ పై వేటు వేసి అక్షర్ పటేల్ కు వైస్ కెప్టెన్సీ అప్పగించారు. ఈ మెగా టోర్నీలో ముగ్గురు సీనియర్ క్రికెటర్ల సేవలను టీమిండియా కోల్పోతుంది. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లకు వరల్డ్ కప్ స్క్వాడ్ లో స్థానం దక్కలేదు. ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్లను సెలక్ట్ చేయకపోవడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..
శ్రేయాస్ అయ్యర్:
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉండడానికి శ్రేయాస్ అయ్యర్ అన్ని విధాలుగా అర్హుడైనప్పటికీ ఈ ముంబై బ్యాటర్ కు చోటు దక్కలేదు. మిడిల్ ఆర్డర్ లో ఆడే అయ్యర్ కు ఎక్కడా స్థానం లేదు. తిలక్ వర్మ జట్టులో పాతుకుపోయాడు. మరోవైపు హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్ టన్ సుందర్ రూపంలో జట్టులో ఆల్ రౌండర్లు నిండిపోయారు. 2025 ఐపీఎల్ సీజన్ లో అత్యద్భుతంగా ఆడినప్పటికీ అయ్యర్ కు దురదృష్టవశాత్తు స్క్వాడ్ లో చోటు దక్కలేదు. దీనికి తోడు ప్రస్తుతం శ్రేయాస్ గాయం కారణంగా ఫిట్ గా లేకపోవడం అతనికి ప్రతికూలంగా మారింది.
కేఎల్ రాహుల్:
భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కు టీమిండియా సెలక్టర్లు ఎప్పుడో గుడ్ బై చెప్పారు. అనుభవం కారణంగా టీ20 వరల్డ్ కప్ లో రాహుల్ ఎంపికవుతాడనుకున్నా అలా జరగలేదు. కుర్రాళ్లతో పోటీ కారణంగా రాహుల్ కు జట్టులో అవకాశం దక్కడం లేదు. అనుభవజ్ఞుడైన రాహుల్ లేకపోయినా ఆ ప్రభావం జట్టుపై పడే అవకాశం లేదు. వికెట్ కీపర్ గా సంజు శాంసన్ తొలి ఆప్షన్ కాగా.. ఇటీవలే దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటి సూపర్ ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషాన్ కు జట్టులో ఛాన్స్ ఇచ్చారు. ఐపీఎల్ 2025 సీజన్ లో రాహుల్ అద్భుతంగా రాణించినా అతనికి నిరాశ తప్పలేదు.
రిషబ్ పంత్:
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు 2026 టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ లో స్థానం దక్కలేదు. 2024 టీ20 వరల్డ్ కప్ లో ఏకంగా ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్న పంత్ కు ఈ సారి నిరాశే ఎదురైంది. ఐపీఎల్ 2025 సీజన్ లో ఘోరంగా విఫలం కావడం పంత్ టీ20 అవకాశాలను తీవ్రంగా దెబ్బ తీసింది. దీనికి తోడు గాయాలు పంత్ ను రేస్ నుంచి వెనకపడేశాయి. 2025 లో పంత్ ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. మ్యాచ్ విన్నర్ గా పేరున్న పంత్ ను తప్పించి వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, ఇషాన్ కిషాన్ లను ఎంపిక చేశారు.
