చిక్కమగళూరు: కర్ణాటకలోని ముదిగెరె తాలూకా హండి గ్రామంలో హోమ్‌స్టే రూమ్ బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్లిన యువతి అనుమానాస్పద స్థితిలో కుప్పకూలి మరణించింది. మృతురాలిని హసన్ జిల్లా బేలూర్ తాలూకాలోని దేవలాపూర్ గ్రామానికి చెందిన రంజిత (27) గా గుర్తించారు. మృతురాలు రంజిత శుక్రవారం సాయంత్రం దావణగెరెకు చెందిన తన స్నేహితురాలు రేఖతో కలిసి హోమ్‌స్టేలో ఉంది. రంజిత, రేఖ స్నేహితుడి నిశ్చితార్థం కోసం బెంగళూరు నుంచి హండి గ్రామానికి వెళ్లారు.
శనివారం (25) ఉదయం రేఖ స్నానం చేసిన తర్వాత, రంజిత స్నానం చేయడానికి వెళ్ళింది. ఆమె చాలా సేపు బయటకు రాకపోవడం, వాటర్ ట్యాప్ కట్టేయకుండా నీళ్లు పోతున్న శబ్దం వినిపించడంతో, రేఖ బాత్రూం డోర్ తట్టింది. ఎన్నిసార్లు బాత్రూం డోర్ కొట్టినా లోపల నుంచి ఉలుకూపలుకూ లేకపోవడంతో ఆమె కిటికీలో నుంచి లోపలికి చూసింది. రంజిత బాత్రూంలో కుప్పకూలిపోయి కనిపించింది. హోమ్‌స్టే సిబ్బందికి వెంటనే సమాచారం అందించగా, వారు తలుపు పగలగొట్టి చూసేసరికి, అపస్మారక స్థితిలో ఉన్న రంజితను ముదిగెరెలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే, అప్పటికే రంజిత చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు.
రంజిత మరణానికి ఖచ్చితమైన కారణం తెలియలేదు. బాత్రూంలో గ్యాస్ గీజర్ ఉండటం వల్ల ఆమె గ్యాస్ లీకేజీ కారణంగా మరణించి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, బాత్రూంలో వెంటిలేటర్ సిస్టం సవ్యంగానే ఉందని, గ్యాస్ లీకేజీకి సంబంధించిన ఆనవాళ్లు ఏవీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఆ యువతి గుండెపోటుతో మరణించి ఉండవచ్చా? లేక మరే కారణమైనా ఉందా అనే విషయం.. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక తెలుస్తుందని పోలీసులు చెప్పారు.
రంజిత అనుమానాస్పద మృతిపై అల్దూర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. రంజిత తల్లిదండ్రులకు ఆమె మృతిపై సమాచారం అందించారు. 27 ఏళ్ల వయసులో తమ కన్న కూతురు అర్థాంతరంగా తనువు చాలించడంతో రంజిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
