బ్యాట్ పట్టుకోవటం తెలియని వాళ్లు క్రికెట్ కమిటీల్లో ఉంటారా.. ఉండాల్సింది మాజీ క్రికెటర్లు కదా

బ్యాట్ పట్టుకోవటం తెలియని వాళ్లు క్రికెట్ కమిటీల్లో ఉంటారా.. ఉండాల్సింది మాజీ క్రికెటర్లు కదా

న్యూఢిల్లీ: కనీస అనుభవం లేని వ్యక్తులు క్రీడా సంస్థలను నిర్వహించడంపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అసలు బ్యాట్ ఎలా పట్టుకోవాలో తెలియని వారు కాకుండా రిటైర్డ్ క్రికెటర్లు, అనుభవం ఉన్న వారు క్రికెట్ కమిటీలకు నాయకత్వం వహించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. 2026, జనవరి 6న జరగాల్సిన మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఎన్నికలపై బాంబే హైకోర్టు స్టే విధించింది. బంధుప్రీతి, తమకు అనుకూలంగా ఉన్నవారికే పదవులు కట్టబెడుతున్నారంటూ హైకోర్టు ఎన్నికలను నిలిపేసింది. 

దీంతో బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎంసీఏ, మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సీజేఐ సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మల్య బాగ్చి, విపుల్ ఎం పంచోలిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. బాంబే హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. 

ఈ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‎లో సభ్యుల సంఖ్యను ఎందుకు ఒకేసారి భారీగా పెంచారని ప్రశ్నించారు. ఎంసీఏ తన సభ్యత్వాన్ని 300కి విస్తరించాలనుకుంటే.. ఆ స్థానాల్లో అంతర్జాతీయ రిటైర్డ్ ఆటగాళ్ల, అనుభవజ్ఞులను నియమించాలని సూచించారు. 

ఆటగాళ్ల వల్లే క్రీడా సంఘాలు ఉన్నాయని.. నిర్వాహకుల వల్ల కాదని చురకలంటించారు. అసలు బ్యాట్ ఎలా పట్టుకోవాలో తెలియని వారు కాకుండా రిటైర్డ్ క్రికెటర్లు, అనుభవం ఉన్న వారు క్రికెట్ కమిటీలకు నాయకత్వం వహించాలని సూచించారు. పిటిషనర్లు తమ పిటిషన్లను ఉపసంహరించుకోవడానికి అనుమతించిన సుప్రీంకోర్టు.. బాంబే హైకోర్టులోనే ఈ కేసు తేల్చుకోవాలని సూచించింది.

అసలు వివాదం ఇదే:

2026 ప్రారంభంలో సుమారు 400 మంది కొత్త సభ్యులను ఎంసీఏ హడావిడిగా చేర్చుకున్నట్లు వార్తలు రావడంతో ఈ వివాదం మొదలైంది. ఎంసీఏ ఎన్నికలకు ముందు మోసపూరితంగా 400 మంది చేర్చుకున్నారని  ఆరోపిస్తూ భారత మాజీ క్రికెటర్, బీజేపీ నాయకుడు కేదార్ జాదవ్ బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ఎంసీఏలో కొత్తగా చేరిన వారిలో చాలామంది ఎన్‌సిపి-ఎస్పీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ దగ్గరి బంధువులు, వ్యాపార సహచరులు ఉన్నారని ఆరోపించారు. ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టి బాంబే హైకోర్టు.. 2026, జనవరి 6న జరగనున్న ఎంసీఏ ఎన్నికలపై స్టే విధించింది.