నార్త్ ఇండియన్స్.. మా హోటళ్లలో టేబుల్స్ క్లీనింగ్, పానీపూరీ అమ్ముకుంటారు : రచ్చ లేపిన మంత్రి కామెంట్స్

నార్త్ ఇండియన్స్.. మా హోటళ్లలో టేబుల్స్ క్లీనింగ్, పానీపూరీ అమ్ముకుంటారు : రచ్చ లేపిన మంత్రి కామెంట్స్

తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడు నార్త్ ఇండియన్స్ రగడ నడుస్తోంది. నార్త్ ఇండియా నుంచి వచ్చే కుర్రోళ్లు.. మనుషులు.. మా తమిళనాడు హోటళ్లల్లో టేబుల్స్ క్లీన్ చేస్తారు.. రోడ్లపై పానీపూరీ అమ్ముకుంటారు.. తక్కువ జీతానికి వస్తారని నార్త్ ఇండియన్స్ ను పెట్టుకుంటారు.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్ కే మంత్రి పన్నీర్ సెల్వం. నార్త్ ఇండియా వాళ్లకు హిందీ బాష ఒక్కటే వచ్చు.. వాళ్లు అక్కడ బతకలేక మన సౌత్ ఇండియా వచ్చి లేబర్ పనులు చేస్తుంటారు అంటూ కామెంట్ చేశారాయన. మంత్రి కామెంట్స్ తమిళనాడులో ఇప్పుడు రచ్చ లేపుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ పార్టీ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ.. మంత్రిని తిట్టిపోస్తుంది. సోషల్ మీడియాలో తమిళనాడు వర్సస్ బీజేపీ మధ్య వార్ నడుస్తుంది.

ALSO READ : గురువారం దిగొచ్చిన గోల్డ్.. వెండి కేజీకి రూ.20వేలు తగ్గింది..

ఉత్తరాది రాష్ట్రాల నుంచి వలస వచ్చి తమిళనాడులో పనిచేస్తున్న కార్మికులపై ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎం.ఆర్.కె. పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. డీఎంకే పార్టీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. నార్త్ ఇండియన్స్ కేవలం టేబుళ్లు తుడవడానికి, భవన నిర్మాణ పనులకు, పానీ పూరీ అమ్ముకోవడానికే తమిళనాడుకు వస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ మాత్రమే నేర్చుకోవడం వల్ల అక్కడ ఉపాధి అవకాశాలు లేకనే వారు ఇక్కడికి వలస వస్తున్నారని ఎద్దేవా చేయడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.

ALSO READ : జాబ్ పోయిందా..? పీఎఫ్ అకౌంట్లో ఎంత డబ్బు ఒకేసారి తీసుకోవచ్చో తెలుసా..?

మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. డీఎంకే నేతలు కావాలనే ఉత్తరాది వారిని లక్ష్యంగా చేసుకుని సామాజిక విభజనను ప్రోత్సహిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. నేటి భారతదేశంలో ఏ పనీ చిన్నది కాదు, ఏ పౌరుడూ తక్కువ కాదని స్పష్టం చేస్తూ.. మంత్రి వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయని మండిపడింది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టడం తగదని, ఇలాంటి వ్యాఖ్యలు వలస కార్మికులపై దాడులకు ప్రేరేపించే అవకాశం ఉందని బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది.

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉత్తరాది వారిపై విద్వేషం పెరిగిపోయిందని విమర్శించారు. మంత్రి పన్నీర్ సెల్వం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కష్టపడి పనిచేసే శ్రామికులను కించపరచడం డీఎంకే సంస్కృతికి నిదర్శనమని మండిపడ్డారు. గతంలో కూడా డీఎంకే నేతలు పలు సందర్భాల్లో హిందీ మాట్లాడే వారిని, ఉత్తరాది వారిని హేళన చేస్తూ మాట్లాడిన సంగతి తెలిసిందే.

ALSO READ : అమెరికా నుంచి ఐఫోన్, ల్యాప్‌టాప్ తెస్తున్నారా?

మరోవైపు ఈ వివాదం ఇండియా కూటమిలోని ఇతర నేతలకు కూడా సెగ తగిలేలా కనిపిస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ వంటి నేతలు ఈ వ్యాఖ్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ ప్రశ్నించింది. సామాజిక న్యాయం గురించి మాట్లాడే వీరు.. తమ మిత్రపక్ష నేత ఇంతటి నీచమైన వ్యాఖ్యలు చేస్తే ఎందుకు స్పందించడం లేదని నిలదీసింది. దేశ సమగ్రత కంటే కూటమి ప్రయోజనాలే వీరికి ముఖ్యమా అని బీజేపీ ఎద్దేవా చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారటంతో దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.