అగ్రికల్చర్, డెయిరీ రంగాలకు నష్టం ఉండదు: US ట్రేడ్ డీల్‎పై గోయల్ ప్రకటన

అగ్రికల్చర్, డెయిరీ రంగాలకు నష్టం ఉండదు: US ట్రేడ్ డీల్‎పై గోయల్ ప్రకటన

న్యూఢిల్లీ: అమెరికాతో జరిగిన ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌తో మన వ్యవసాయ, డెయిరీ రంగాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఒప్పందంతో మనకు ప్రయోజనమే తప్ప, నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. ట్రేడ్ డీల్ కారణంగా మన వ్యవసాయ, డెయిరీ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో బుధవారం లోక్‌‌‌‌సభ, రాజ్యసభలో గోయల్ ప్రకటన చేశారు. వ్యవసాయ, డెయిరీ రంగాలకు నష్టం జరగకుండా రక్షణ కల్పించినట్టు తెలిపారు. 

ఈ రెండు రంగాల ప్రయోజనాలే లక్ష్యంగా చర్చలు జరిపినట్టు పేర్కొన్నారు. ‘‘ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌తో మన దేశంపై విధిస్తున్న టారిఫ్‌‌‌‌లను 18 శాతానికి అమెరికా తగ్గించింది. ఇతర దేశాలపై విధిస్తున్న పన్నులతో పోలిస్తే ఇది తక్కువ. తద్వారా యూఎస్‌‌‌‌కు మన ఎగుమతులు భారీగా పెరుగుతాయి. దేశ ఇండస్ట్రీలకు ప్రయోజనం చేకూరుతుంది” అని వెల్లడించారు.

అమెరికా నుంచి ఇంధన కొనుగోళ్లపై స్పందిస్తూ.. ‘‘140 కోట్ల మంది భారతీయులకు ఇంధన భద్రత కల్పించడమే మా లక్ష్యం. అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా దిగుమతుల విషయంలో నిర్ణయం తీసుకున్నాం” అని చెప్పారు. ‘‘ఏవియేషన్, డేటా సెంటర్లు, న్యూక్లియర్ పవర్ వంటి రంగాల్లో అమెరికా ముందుంది. ఆయా రంగాల్లో అమెరికా అందించే సహకారం ‘వికసిత్ భారత్–2047’ లక్ష్యానికి దోహదపడుతుంది” అని పేర్కొన్నారు.