కాలేజీనే ఇల్లుగా వాడుకుంటుండు! 

కాలేజీనే ఇల్లుగా వాడుకుంటుండు! 
  • తినడం, పడుకోవడం అక్కడే
  • పెబ్బేరు పాలిటెక్నిక్‌ కాలేజీ ప్రిన్సిపాల్ నిర్వాకం

పెబ్బేరు, వెలుగు: కాలేజీనే ఇల్లు లెక్క వాడుకుంటుండో ప్రిన్సిపాల్‌. ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటున్న ఆయన బయట రూమ్‌ రెంట్లు ఏం కడదామనుకున్నాడో ఏమో.. ఏకంగా తన చాంబర్‌‌నే బెడ్‌రూమ్‌గా మార్చుకున్నాడు. వండడం, తినడం, పడుకోవడం అక్కడే చేస్తున్నాడు.  వివరాల్లోకి వెళ్తే..  పెబ్బేరు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్​ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న జీవీ రమేశ్‌ కుమార్ 24 గంటలు కాలేజీలోనే ఉంటున్నాడు.  తన చాంబర్‌‌లోనే కరెంట్ పొయ్యి, రైస్‌ కుక్కర్‌‌ పెట్టుకొని సిబ్బందితో వంట చేయించుకుంటున్నాడు. అక్కడే తినడం, పడుకోవడం చేస్తున్నాడు. రెండేళ్లుగా కాలేజీలోనే మకాం వేశాడని స్థానికులు చెబుతున్నారు.   ‘ఎన్‌హెచ్‌ఆర్‌‌’  వనపర్తి జిల్లా యూత్‌ సెక్రటరీ మహ్మద్‌ ఇమ్రాన్‌ ద్వారా  సమాచారం తెలుసుకున్న ‘వీ6 వెలుగు’ శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో కాలేజీని సందర్శించింది. ఈ సమయంలో ప్రిన్సిపాల్‌ అక్కడే ఉన్నారు. ఎందుకున్నారని ఆరా తీయగా  పనివల్ల  ఆలస్యం అయ్యిందని చెప్పాడు. గట్టిగా నిలదీయగా  కరోనా కారణంగా కొన్నిరోజులుగా కాలేజీలోనే స్టే చేస్తున్నట్లు ఒప్పుకున్నారు.  కాగా, సిబ్బందితోనే అన్ని పనులు చేయించుకుంటున్నారని తెలిసింది.