IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్

IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్

ఐపీఎల్ లో బలమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. సూపర్ కింగ్స్ విజయాల్లో ప్రధాన పాత్ర బౌలర్లదే అని చెప్పుకోవాలి. అనుభవం లేకపోయినా కుర్రాళ్ళు బౌలింగ్ లో సత్తా చాటుతున్నారు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుంది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్ ల్లో మూడు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చెన్నై జట్టుకు భారీ షాక్ తగిలింది. ఏకంగా 5 గురు ప్రధాన బౌలర్లు తర్వాత మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

టీమిండియా ఫాస్ట్ బౌలర్లు దీపక్ చాహర్, తుషార్ దేశ్ పాండే పంజాబ్ తో జరిగిన మ్యాచ్ కు దూరమయ్యారు. అనారోగ్యం కారణంగా దేశ్ పాండే తప్పుకుంటే.. రెండు బంతులు మాత్రమే వేసి గాయం కారణంగా చాహర్ వైదొలిగాడు. వీరిద్దరూ మే 5న పంజాబ్ తో జరగబోయే మ్యాచ్ కు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. ఇక విదీశీ బౌలర్ల విషయానికి వస్తే స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ స్వదేశంలో జరగబోయే సిరీస్ కోసం ఐపీఎల్ ను వదిలి వెళ్లనున్నాడు. 

జింబాబ్వే సిరీస్ తో పాటు బంగ్లాదేశ్ USAతో మూడు T20Iలను ఆడాల్సి ఉంది. దీంతో మే 1 తర్వాత జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ లకు ఈ బంగ్లా పేసర్ దూరం కానున్నాడు. శ్రీలంక బౌలర్లు తీక్షణ, మతీశ పతిరానా వీసా కోసం స్వదేశానికి పయనమయ్యారు. ఐపీఎల్ ముగిసిన వారం రోజుల గ్యాప్ లో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. జూన్ 1 నుంచి ఈ పొట్టి సమరం ప్రారంభమమవుతుంది.

యూఎస్​ఏ, వెస్టిండీస్ ఈ టోర్నీకి సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్నాయి. దీంతో అన్ని దేశాల బోర్డులు క్రికెటర్లకు వీసాలు ఇప్పించడంలో బిజీ అయిపోయాయి. శ్రీలంక క్రికెట్ బోర్డు వీసా కోసం స్వదేశానికి రావాల్సిందిగా ఆదేశించింది. ఈ క్రమంలో తీక్షణ, పతిరానా పంజాబ్ తో మే 5 న జరగబోయే మ్యాచ్ కు అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. దీంతో ఒక్కసారిగా చెన్నై తమ ప్రధాన బౌలర్లను కోల్పోయి కష్టాల్లో పడింది.