బీజేపీతో బీఆర్ఎస్​ లోపాయికారి ఒప్పందం : తుమ్మల నాగేశ్వరరావు

బీజేపీతో బీఆర్ఎస్​ లోపాయికారి ఒప్పందం : తుమ్మల నాగేశ్వరరావు
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం టౌన్, వెలుగు :  బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పూనుకొల్లు నీరజ బీఆర్ఎస్ ను  వీడి కాంగ్రెస్​లో చేరారు. సంజీవరెడ్డి భవన్ లో మంత్రి తుమ్మల సమక్షంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఆమెతోపాటు 11, 13 డివిజన్ల కార్పొరేటర్లు సరిపూడి రమాదేవి, కొత్తపల్లి నీరజకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్లమెంట్​ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ బీజేపీకి సహకరిస్తోందని ఆరోపించారు.

 ఇండియా కూటమికి ఫస్ట్ ఫేజ్ లో ఉత్తర భారత్ లో అనుకూల ఫలితాలు వస్తాయని విశ్లేషకులు చెప్తున్నారని తెలిపారు. మోదీ మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. అన్ని వర్గాల సమానత్వం కోరేదే కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ తెలంగాణలోని ఏ ఒక్క ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్  ఏర్పాటు చేయాలేదని మండిపడ్డారు.

ఇండియా కూటమితో అధికారంలోకి వస్తే పాలమూరు ప్రాజెక్ట్, రైల్వే లైన్లు, మూసీ ప్రక్షాళన, జాతీయ రహదారులు అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు, మూడు నెలల్లో రైతు రుణమాఫీ చేస్తోందని స్పష్టం చేశారు.  అనంతరం మేయర్ నీరజ మాట్లాడుతూ మంత్రి తుమ్మలతో తనకు 25 ఏళ్ల సాన్నిహిత్యం ఉందన్నారు. కార్పొరేషన్ మేయర్ గా మూడేండ్లుగా నిజాయితీతో పనిచేశానని తెలిపారు. మిగతా రెండేండ్లు కూడా తుమ్మల హయాంలో ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగండ్ల దీపక్ చౌదరి, జిల్లా కాంగ్రెస్ నాయకులు సాధు రమేశ్​రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, మొక్కా శేఖర్ గౌడ్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, నగర డిప్యూటీ మేయర్ జోహర ముక్తార్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.