సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ కు EC నోటీస్

సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ కు EC నోటీస్

మధ్యప్రదేశ్  :  భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కు జిల్లా ఎలక్షన్ అధికారి నోటీసులు పంపించారు. అమరుడు, మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరేపై ఆమె చేసిన కామెంట్లకు జిల్లా ఎన్నికల అధికారి వివరణ కోరారు. హేమంత్ కర్కరేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి కారణాలేంటో వివరిస్తూ ఒక్కరోజులో వివరణ ఇవ్వాలని నోటీసులో సూచించారు ఎన్నికల అధికారి.

“26/11” దాడిలో ఉగ్రవాదుల కాల్పుల్లో అమరుడైన హేమంత్ కర్కరేపై .. సాధ్వి ప్రజ్ఞా చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి. మాలేగావ్ పేలుళ్ల కేసు విచారణలో హేమంత్ కర్కరే తనను హింసించారనీ… తాను శపించడం వల్లే నెలరోజుల్లో హేమంత్ కర్కరే ప్రాణాలు కోల్పోయారని సాధ్వి అన్నారు. దీనిపై అధికారులు, రాజకీయ పార్టీల నుంచి పెద్దఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారామె. ఆ తర్వాత తన వ్యాఖ్యలను ఆమె వెనక్కి తీసుకున్నారు. తన మాటలు శత్రువులకు సంతోషం కలిగించేటట్టయితే… వాటిని వెనక్కి తీసుకోవడానికి సిద్ధమే అని ఆమె చెప్పారు. ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన హేమంత్ కర్కరే అమరుడే అని ఆమె ఒప్పుకున్నారు.