ఆత్మీయ సమ్మేళనంలో చెక్కుల కోసం వచ్చి .. గుండెపోటుతో వృద్ధురాలు మృతి

ఆత్మీయ సమ్మేళనంలో చెక్కుల కోసం వచ్చి .. గుండెపోటుతో వృద్ధురాలు మృతి

మదనాపురం, వెలుగు : వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్​ఆత్మీయ సమ్మేళనంలో చెక్కుల పంపిణీ సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. తన మనవరాలికి సంబంధించిన కల్యాణలక్ష్మి చెక్కు తీసుకోవడానికి వచ్చిన ఓ వృద్ధురాలు సాయంత్రం వరకు వేచి చూసి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. మండలంలోని అజ్జకొల్లుకు చెందిన నడిమిటి నర్సమ్మ(60) తన మనవరాలి కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం ఉదయం పది గంటలకు మదనాపురంలో బీఆర్ఎస్​ఆత్మీయ సమ్మేళనానికి చేరుకుంది. వెంట ఆమె మనవరాలు కూడా వచ్చింది. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు చెక్కులు పంపిణీ చేయగా, నర్సమ్మ దూరంగా ఉండడంతో టైంకు తీసుకోలేకపోయింది. తర్వాత ఆమె వెళ్లి ‘అయ్యా నేను పేరు పిలిచినప్పుడు వచ్చి చెక్కు తీసుకోలేపోయా..నాకు ఆరోగ్యం బాగా లేదు. చెక్కు ఇస్తే పోతా’ అని అక్కడున్న బీఆర్​ఎస్​లీడర్లను అడిగింది. దానికి వారు ఎమ్మెల్యే వెంకటేశ్వర్​రెడ్డి, మంత్రి నిరంజన్​రెడ్డి మాట్లాడిన తర్వాత ఇస్తామని, అప్పటిదాకా ఉంటే తీసుకోవచ్చని, లేకపోతే రేపు తహసీల్దార్​ఆఫీసుకు వెళ్తే ఇస్తారని చెప్పారు. 

మళ్లీ ఊరి నుంచి అక్కడిదాకా రావాల్సి ఉంటుందని, అక్కడే ఉండేందుకు నిర్ణయించుకుంది. మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చిన మంత్రి లంచ్​ చేసిన తర్వాత మూడు గంటలకు ప్రసంగం మొదలుపెట్టారు. పొద్దటి నుంచి ఎండలో ఉండడం, వృద్ధురాలు కావడంతో నీరసపడిపోయిన నర్సమ్మ అక్కడే ఉన్న ఓ ఆటోలో కూర్చుంది. తనకు చేతకావడం లేదని చెప్పడంతో ఆమె మనవరాలు వెళ్లి టిఫిన్​తీసుకువచ్చింది. నాలుగు గంటల వేళ ఆటోలో కూర్చున్న నర్సమ్మ ఒక్కసారిగా కండ్లు తేలేసి తనకు గుండెలో నొప్పిగా ఉందని సైగ చేసింది. దీంతో ఆమె మనవరాలు అక్కడున్నవారికి చెప్పగా వెంటనే కొత్తకోటలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అయితే, అప్పటికే ప్రాణాలు పోయాయని డాక్టర్లు చెప్పారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ప్రకటించారు.


క్రికెట్​ ఆడుతుండగా సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​.. 


ముత్తారం : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రానికి చెందిన కల్యాణపు లక్ష్మీనారాయణ (41) అనే సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ హైదరాబాద్​లో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో చనిపోయాడు. మణికొండలో పని చేస్తున్న లక్ష్మీనారాయణ ప్రతి ఆదివారం క్రికెట్ ఆడుతుంటాడు. ఆదివారం కూడా ఫ్రెండ్స్​తో కలిసి గచ్చిబౌలిలోని ఓ స్టేడియంలో క్రికెట్ ఆడడానికి వెళ్లాడు. ఆట మధ్యలో గుండె నొప్పి రావడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. లక్ష్మీ నారాయణకు భార్య, కొడుకు, బిడ్డ ఉన్నారు.