లక్ష్మి దొరికింది: మావటికి శిక్ష పడింది

లక్ష్మి దొరికింది: మావటికి శిక్ష పడింది

రెండు నెలల క్రితం ఏనుగు లక్ష్మితో పారిపోయిన సద్దాం

మంగళవారం రాత్రి ఢిల్లీ అక్షర్​ధాం గుడి వద్ద ఆచూకీ

16 గంటలు కష్టపడి లక్ష్మిని కాపాడిన అధికారులు

రెండు నెలల క్రితం కనిపించకుండా పోయిన ఏనుగు లక్ష్మి దొరికింది. సెప్టెంబర్​ 17న  (గత మంగళవారం) రాత్రి తూర్పు ఢిల్లీలోని చిల్లా గ్రామానికి సమీపంలో యమునా ఖదర్​ అక్షర్​ధామ్​ గుడి దగ్గర తిరుగుతుండగా స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అధికారులు రాత్రికి రాత్రే అక్కడకు చేరుకుని లక్ష్మిని రక్షించారు. దాదాపు 16 గంటల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్​ తెల్లారి  బుధవారం మధ్యాహ్నం గానీ పూర్తవ్వలేదు. 59 ఏళ్లున్న ఈ ఆడ ఏనుగును బుధవారం ఉదయం షకర్​పూర్​ పోలీస్​స్టేషన్​కు తరలించారు. అటవీ అధికారులు వచ్చి ఢిల్లీలోని ఐటీవో నర్సరీకి తీసుకెళ్లారు. అక్కడ దానికి అన్ని సపర్యలు చేసి శుక్రవారం ఉదయం హర్యానాలోని యమునా నగర్​లో ఉన్న పునరావాస కేంద్రానికి పంపించారు.

అయితే, పోలీస్​ స్టేషన్​ నుంచి నర్సరీకి వైల్డ్​లైఫ్​ ఎస్​వోఎస్​ ప్రతినిధులు తరలిస్తున్న టైంలో ఆ సంరక్షకులు కాసేపు ఆందోళనకు దిగారు. దీంతో మళ్లీ ఏనుగును స్టేషన్​లో ఉంచారు. అంతా సద్దుమణిగాక మావటి సాయంతో దానిని ఐటీవోకు తీసుకెళ్లారు. దానికి రక్షణగా ఆరు బృందాల పోలీసులూ ఎస్కార్ట్​గా వెళ్లడం విశేషం. ఆ ఏనుగు వెనకాలే పోలీస్​ వాహనాలు, బైకులపై జనాలు ఫాలో అయ్యారు. ఐటీవో దాకా రక్షణగా వెళ్లారు. అక్కడికి చేరగానే లక్ష్మికి డజను అరటి పండ్లు పెట్టడంతో పాటు క్వింటాల్​ చెరకును తినిపించారు. హర్యానాకు పంపే ఏర్పాట్లు చేశారు. ఏనుగు నిలబడినప్పుడు ఎలాంటి సమస్యా లేకుండా ట్రక్కులో పొరలుపొరలుగా బురదను పేర్చారు. దారి పొడవునా లక్ష్మి తినేందుకు చెరకు, పుచ్చకాయలు, దోసకాయలు, అరటిపండ్లు, గడ్డి, నీళ్లు ఏర్పాటు చేశారు. ముగ్గురు అటవీ అధికారులు, ఐదుగురు మావటి వాళ్లు యమునా నగర్​లోని బన్​ సంతూర్​ పునరావాస కేంద్రానికి లక్ష్మిని తీసుకొచ్చారు.

ఏనుగుతో పరారయ్యాడు

రెండు నెలల క్రితం (జులై 6) మావటి సద్దాం, లక్ష్మిని తీసుకుని పారిపోయాడు. అప్పటి నుంచి వైల్డ్​ లైఫ్​ అధికారులు దానిని వెతికేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే, అవేవీ ఫలించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం లక్ష్మి దొరకడంతో సద్దాం ఆచూకీ దొరికింది. అతడిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. లక్ష్మి బాగోగులు చూసుకునే యూసుఫ్​ అలీ, అతడి కొడుకు షకీర్​ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇంకో విషయమేంటంటే, లక్ష్మినే ఢిల్లీలో ఉన్న చివరి ఏనుగు కావడం. లక్ష్మి జూనోటిక్​ వైరల్​ జబ్బుతో బాధపడుతోంది. దీంతో దానిని పునరావాస కేంద్రానికి పంపించాలని అధికారులు నిర్ణయించారు. పంపుదామనుకునే లోపే లక్ష్మితో సద్దాం పరారయ్యాడు.