హైదరాబాద్ నగరానికి ఎక్సలెన్సీ అవార్డు

హైదరాబాద్ నగరానికి ఎక్సలెన్సీ అవార్డు

హైదరాబాద్ నగరానికి మరో అవార్డు దక్కింది. కొద్ది రోజుల కిందటే ODF ప్లస్ ప్లస్ అవార్డు పొందిన గ్రేటర్ సిటీ…  ఇప్పుడు స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డును సొంతం చేసుకుంది. దేశంలోని మెట్రో పాలిటన్ సిటీల్లో హైదరాబాద్ నగరానికే ఈ అరుదైన గౌరవం దక్కింది.

స్వచ్ఛతలో భాగంగా బల్దియా చేపడుతున్న కార్యక్రమాలకు మంచి గుర్తింపు వస్తోంది. తాజాగా స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ఎక్సలెన్సీ అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దేశంలోని మెట్రో పాలిటన్ సిటీల్లో హైదరాబాద్ నగరానికే ఈ పురస్కారం దక్కింది.

GHMCలో కార్మికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించినందుకు గుర్తింపుగా అవార్డు దక్కిందన్నారు బల్దియా కమిషనర్ దాన కిషోర్. స్వచ్ఛతలో భాగంగా పది రోజుల్లో 2 అవార్డులు దక్కడం సంతోషంగా ఉందన్నారు. సిటీలో మానవ వ్యర్థాల నిర్వహణలో GHMCకి కొద్ది రోజుల కిందటే ODF ప్లస్ ప్లస్ గుర్తింపు లభించింది. సిటీలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణతో పాటు ఓపెన్ డెఫికేషన్ లేకుండా చెయ్యడంతో ఈ ర్యాంకు వచ్చింది. ఇంతలోనే మరో అవార్డు రావడంతో GHMC అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొన్నేళ్లుగా స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా GHMCకి వివిధ అవార్డులు దక్కాయి. ఇదే స్ఫూర్తితో స్వచ్ఛ సర్వేక్షన్ 2019 లో మంచి ర్యాంక్ సాధించేందుకు ప్లాన్ చేస్తున్నామంటున్నారు అధికారులు.