కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీపై మర్లవడ్డ రైతులు

కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీపై మర్లవడ్డ రైతులు
  • బ్యాక్​వాటర్​తో మా భూములు మునిగిపోతయి
  • శాశ్వత పరిష్కారం చూపాలని రైతుల డిమాండ్

జయశంకర్​భూపాలపల్లి/మహదేవపూర్, వెలుగు: ‘మీ పని చూసుకొని ఒడ్డున పడ్డరు.. మమ్మల్ని మాత్రం  గోదారివరి నదిలో ముంచిండ్రు.. అన్నీ తెలిసి బ్యారేజీ కట్టిండ్రు.. కేసీఆర్ చెప్పిండని ఉరికురికి పని చేస్తిరి.. కనీసం ఇంతమంది రైతుల నోళ్లల్ల మన్ను పడతదని ఒక్కసారన్న ఆలోచించకపోతిరి’ అంటూ శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్​ఇన్​చీఫ్(ఈఎన్సీ) నల్ల వెంకటేశ్వర్లుపై అన్నారం బ్యారేజీ ముంపు ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం బ్యాక్​వాటర్​ముంపు ప్రభావంపై స్టడీ చేసి 8 వారాల్లోగా రిపోర్ట్​ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్​హెచ్​ఆర్ సీ నోటీసులు జారీ చేసింది. దీంతో ప్రాజెక్టులో అతి ప్రధానమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ ముంపు ప్రాంత భూములను పరిశీలించేందుకు ఈఎన్సీ వచ్చారు. విషయం తెలుసుకున్న అన్నారం బ్యారేజీ ముంపు బాధిత గ్రామాలైన అన్నారం, చంద్రుపల్లి, నాగేపల్లి, సుందరశాల రైతులు ఈఎన్సీ వెంకటేశ్వర్లును ఘెరావ్ చేశారు. మా బతుకులు నాశనం కావడానికి నువ్వే కారణమంటూ విరుచుకుపడ్డారు. కొన్నాళ్లుగా వారు పడుతున్న బాధనంతా వెళ్లగక్కారు. తమకు శాశ్వత పరిష్కారం చూపకపోతే సహించేది లేదని హెచ్చరించారు. శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని, కొంత టైం పడుతుందని ఈఎన్సీ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. 


కంటిన్యూగా పంట మునుగుడే  
2019 లో అన్నారం బ్యారేజీ ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం సుమారు వెయ్యి ఎకరాలు ఎగువన బ్యాక్ వాటర్ తో ముంపునకు గురైతే .. గేట్లు తెరిచిన ప్రతిసారీ సుమారు 1,500 ఎకరాలు డౌన్ స్ట్రీంలోని పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో కొన్ని నెలలుగా అన్నారం బ్యారేజీ కింద పంట నష్టపోతున్న రైతులు శాశ్వత పరిష్కారం చూపాలని ఆందోళనలు చేస్తున్నారు. బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారం బ్యారేజీ వద్ద ధర్నా చేస్తున్న రైతులకు అక్టోబర్ 1న మద్దతు తెలిపారు. ముంపునకు గురైన పంటలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయమై శాశ్వత పరిష్కారం చూపాలని ఆఫీసర్లకు ముంపు రైతులు ఎన్నోసార్లు  నివేదికలు ఇచ్చారు. సమస్య పరిష్కరించకపోవడంతో విసిగిన రైతులు ఆందోళనకు దిగారు. పలుసార్లు ఇరిగేషన్ ఆఫీస్ వద్ద ధర్నాలు చేస్తూ వస్తున్నారు. 

పంటల సర్వే చేయలే 
ఉన్న రెండెకరాల్లో పత్తి పెడితే రెండుసార్లు అన్నారం బ్యారేజీ బ్యాక్​ వాటర్ తో మునిగిపోయింది. మొదటిసారి మంచిగా పెరిగి పూత పట్టే సమయంలో మునిగితే రెండోసారి మొక్క పెరుగుతున్నప్పుడే మునిగి లక్ష రూపాయలు పెట్టుబడి పోయింది. మునిగిన పంటల సర్వే  చేయలే. పరిహారం కింద ఇప్పటివరకు ఒక్క పైసా ఇయ్యలే. కనీసం ఇప్పటివరకు వచ్చి చూసినోళ్లే లేరు. ఇగ వీళ్లను ఎట్ల నమ్మాలే.   ‒ ఏల్పుల ఐలక్క, మద్దులపల్లి  రైతు, 
మహాదేవ్​పూర్​ మండలం

ఇగ మర్లబడుతూనే ఉంటం 
బ్యారేజీ స్టార్ట్ అయినప్పటి నుంచి నా నాలుగెకరాల భూమి నీళ్లల్ల మునిగే ఉంటోంది. ఏదన్న పంట వేసుడుతోనే గేట్లు ఎత్తి నీళ్లను కిందికి వదులుడు.. నా పంట మునుగుడు. ఏటా ఇదే తంతు. బతుకు నరకమైతాంది. ఇప్పటికైనా పరిష్కారం చూపకపోతే రైతులంతా మర్లబడుతూనే ఉంటం‒ సోదారి సమ్మయ్య, ముంపు బాధిత రైతు, చంద్రుపల్లి


ఇట్ల మోసం చేస్తరని అనుకోలే
అన్నారం బ్యారేజీ కడుతున్నాం మీరు బాగుపడుతరంటే రైతులందరం నిజమే అనుకుని భూములిచ్చినం. బ్యారేజీ పూర్తయినంక తెలిసింది మమ్మల్ని మోసం చేశారని. బ్యారేజీకి ఇవ్వంగా పోను మిగిలిన మూడెకరాల్లో వ్యవసాయం చేసుకుందామంటే ఎప్పుడూ నీళ్లల్ల మునుగుడేనాయె. పని కోసం కూలికి పోతున్నా. అన్నం పెట్టే రైతులం.. మమ్మల్ని ఎట్లా మోసం చేయాలనిపించిందో అని రోజూ బాధపడుతున్నాం‒ గోమాస సంతోషం, చంద్రుపల్లి  రైతు, మహాదేవ్​పూర్​ మండలం