వానొస్తే మునుగుడే

వానొస్తే మునుగుడే
  • వేసవిలో హిమాయత్​సాగర్​, ఉస్మాన్​సాగర్​ నీళ్లు వాడని సర్కార్​
  • పక్కనే ఉన్న నీళ్లను వదిలి గోదావరి నుంచి సిటీకి తరలింపు

హైదరాబాద్, వెలుగు: హిమాయత్ సాగర్, ఉస్మాన్​ సాగర్ (గండిపేట్)  జలాశయాలు వానలు పడక ముందే  ఫుల్​గా ఉన్నాయి.  దీంతో ఒక మోస్తరు వానపడ్డా, ఎగువ ప్రాంతం నుంచి నీరు వచ్చి గేట్లు ఎత్తాల్సి వస్తే హైదరాబాద్​ నగరానికి వరద ముంపు తప్పదని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది వేసవిలో తాగునీటికి గానీ, ఇతర అవసరాలకు గానీ జంట జలాశయాలను వాడుకోకపోవడంతోనే  ఈ సమస్య ఎదురవుతున్నదని పర్యావరణవేత్తలు అంటున్నారు. 

ఎండాకాలంలో వాడుకోలే!
ఎండాకాలంలో గ్రేటర్​ హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో తాగు నీటి సమస్య ఉన్నా.. జంట జలాశయాల నుంచి నామమాత్రంగా నీళ్లు వాడుకున్నారు. సిటీకి బయట ప్రాంతాల నుంచి వచ్చే కృష్ణా, గోదావరి నీటిలో దీని వాటా ఐదు శాతం కూడా కాదని వాటర్​ బోర్డు లెక్కలు చెప్తున్నాయి. ఎండా కాలంలో నీటిని వాడుకోకుండా ఇప్పుడు పడే చిన్నవర్షం వల్ల జంట జలాశయాల నీటిని మూసీ పాలు చేయాల్సి వస్తుంది. 

లంగర్​ హౌస్​ నుంచి..!
పెద్ద వర్షం పడితే మాత్రం లంగర్ హౌస్ నుంచి మొదలు చాదర్ ఘాట్, మూసారం బాగ్, మలక్ పేట్​ మీదుగా నాగోల్​ వరకు మూసీ తీర ప్రాంతాలు ముంపుకు గురవుతాయి. దీంతో లక్షలాది జనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. బస్తీలతోపాటు అనేక కాలనీలకు వరద నీళ్లు వచ్చే ప్రమాదం ఉంది. కేవలం హైదరాబాద్​ సిటీలోనే కాకుండా మూసీ పరివాహక ప్రాంతమైన  భువనగిరి, నల్లొండ జిల్లాల్లో కూడా  పంటలపై ప్రభావం పడుతుంది. గతంలో అనేక సార్లు మూసీ వరదల వల్ల సిటీలోని జనంతో పాటు పరివాహక ప్రాంతంలోని రైతులు ఎంతో ఇబ్బందులు పడ్డారు. పంటలు నీట మునిగి నష్టాల పాలయ్యారు. మూసీ పరివాహక ప్రాంతంలో గడ్డి, ఆకు కూరలు, కూరగాయలు పండిస్తారు. నల్గొండ జిల్లాలో వరి కూడా సాగు చేస్తారు. దీన్ని బట్టి మూసీ వరదల మూలంగా వచ్చే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 

వరద నివారణ కోసం నిర్మిస్తే.. !
వాస్తవానికి మూసీ వరదల వల్ల జనం పడుతున్న ఇబ్బందిని దృష్టిలో పొట్టుకొనే జంట జలాశయాలను నిజాం హయాంలో నిర్మించారు. నిజాం వినతి మేరకు ప్రపంచ ప్రఖ్యాత ఇంజినీర్​ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ జలాశయాలను నిర్మించిందే వరద ముప్పు నుంచి నగరాన్ని కాపాడటానికి. అయితే.. ఇప్పుడు కొన్ని ప్రయోజనాల కోసం చేసిన నిర్లక్ష్యం వల్ల అవే జలాశయాలు వరద ముంపునకు కారణం కానున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. 111​ జీవోకు తూట్లు పొడిచి రియల్​ ఎస్టేట్​ రంగానికి ప్రయోజనం చేకూర్చాలనే సర్కారు చేసిన ఆలోచనతోనే ఈ ప్రమాదం ఏర్పడుతున్నదని  అంటున్నారు. జంట జలాశయాలతో ఇప్పుడు పని లేదని, కృష్ణా, గోదావరి నుంచి నీళ్లు తెచ్చి జంట నగరాల ప్రజల దాహార్తి తీరుస్తున్నామని ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులంతా చెప్తూ వస్తున్నారు. అయితే.. జలాశయాలు అందుబాటులో ఉండటం,  అందులోని నీళ్లు అనంతగిరి పర్వత శ్రేణుల నుంచి వచ్చే క్రమంలో ఔషధ గుణాలు సంతరించుకోవడంతో ఎప్పటి నుంచో జనానికి ఆ నీళ్లను సరఫరా చేస్తున్నారు. అంతేకాదు ఈ జలశయాల నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయి. సరఫరాకు అయ్యే ఖర్చు బాగా తక్కువ. కానీ ఈ నీటికి పూర్తిగా పక్కన బెట్టి వందల కిలోమీటర్ల నుంచి బోలెడు ఖర్చుతో  నీటిని తెచ్చి నగరవాసులకు అందజేస్తున్నారు. 

వాడింది అంతంతే!
జలమండలి పరిధిలో ప్రస్తుతం రోజూ 541 ఎంజీడీల (2,386 మిలియన్​ లీటర్ల) తాగునీటి డిమాండ్ ఉంది. ఎండల తీవ్రత ఇంకా తగ్గక పోవడంతో డిమాండ్ తగ్గడంలేదు. ఇందులో సోమవారం కృష్ణా జలాలు 1,168 మిలియన్​ లీటర్లు, గోదావరి జలాలు 743 మిలియన్​ లీటర్లు, మంజీరా నుంచి 126 మిలియన్​ లీటర్లు, సింగూర్ నుంచి 283 మిలియన్​ లీటర్లు తరలించగా.. పక్కనే ఉన్న హిమాయత్ సాగర్​ నుంచి 10 మిలియన్​ లీటర్లు, ఉస్మాన్​ సాగర్ నుంచి 56 మిలియన్​ లీటర్లే వినియోగించారు. రెండు జలాశయాల నుంచి ఈ కొద్ది మాత్రం నీళ్లూ వినియోగించుడు కొన్నిరోజుల నుంచే జరుగుతున్నది. అంతకు ముందు అసలు చుక్క నీటిని కూడా వాడలేదు. 

నిరుపయోగంగా ఎందుకు...?  
తక్కువ ఖర్చుతో నగరానికి నీటి సరఫరా చేసే హిమాయత్ సాగర్,  ఉస్మాన్ సాగర్  జలాశయాల నీటిని ఈ ఏడాది ఎందుకు వినియోగించలేదు? నిరుపయోగంగా ఉంచేందుకు కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది  చర్చనీయాంశమైంది.  111 జీవోను ఎత్తివేయడంలో భాగంగా ఈ జలాశయాలను నిరుపయోగంగా చూపించేందుకే ప్రభుత్వం ఇలా చేసిందని ప్రచారం జరుగుతున్నది. 1908లో వచ్చిన వరదల వల్ల  భవిష్యత్​ లో ఇబ్బందులు ఉండకుండా, అప్పట్లో  ఇంజనీర్​ విశ్వేశ్వరయ్య ఆలోచనల మేరకు ఈ జలాశయాలను నిర్మించారు. ఈ జలాశయాలను వరదలు రాకుండా మెయింటెన్​ చేయాల్సి ఉంది. కానీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా నీటిని ఫుల్​ గా ఉంచారు. 

చిన్న వానపడ్డా..!
జంట జలాశయాల్లో ఇప్పుడు పూర్తి నిలువ మట్టాని(ఎఫ్​టీఎల్​)కి రెండు నుంచి నాలుగు అడుగులు మాత్రమే తక్కువగా నీళ్లు ఉన్నాయి. ప్రస్తుతం హిమాయత్​సాగర్​లో 1,761 అడుగుల వరకు నీళ్లుండగా.. ఈ జలాశయం ఎఫ్​టీఎల్​ సామర్థ్యం 1,763 అడుగులు. ఉస్మాన్​సాగర్​ ఎఫ్​టీఎల్​ 1,790 అడుగుల సామర్థ్యంతో ఉండగా.. ఇప్పుడు అందులో 1,786 అడుగుల నీళ్లున్నాయి. అంటే రెండు జలాశయాలు ఫుల్​గా ఉన్నట్లే. దీంతో చిన్న వాన పడ్డా  వెంటనే అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఉందని అధికారులు చెప్తున్నారు. ఎగువ ప్రాంతంలో 8 సెం.మీ. పైగా వాన పడితే  కొద్దిగంటల్లోనే ఈ జలాశయాల్లోకి నీళ్లు వస్తాయి. దీన్ని అంచనా వేసిన మరుక్షణమే అధికారులు నీళ్లను కిందికి వదిలేయాల్సి వస్తుంది. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా జలాశయాలకు గానీ, లోతట్టు ప్రాంతాలకు గానీ ప్రమాదకరంగా పరిణమిస్తుందని నిపుణులు చెప్తున్నారు. 

పక్కన ఉన్న నీళ్లు కాదని దూరం నుంచి తెస్తున్నరు
హైదరాబాద్​ నగర శివారు ప్రాంతాల్లో ఉన్న హిమాయత్ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉస్మాన్​ సాగర్​ జలాశయాల నుంచి నీటిని సరఫరా చేయకుండా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను,  180 కిలో మీటర్ల దూరంలో ఉన్న కోదండాపూర్ నుంచి కృష్ణ నీళ్లను నగరానికి తీసుకొస్తున్నారు. ఈ జలాల తరలింపుతో పాటు  నగరం నలుమూలలా సరఫరా కోసం జలమండలి  200 మెగావాట్ల విద్యుత్‌‌‌‌‌‌‌‌ను వినియోగిస్తున్నది. ఇందుకు నెలకు రూ.70 కోట్ల మేర బిల్లులు చెల్లిస్తున్నది. అంటే రోజూ కరెంట్​ కోసం రూ.2 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నది. అదే గనుక హిమాయత్ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఉస్మాన్​ సాగర్ నీటిని వియోగిస్తే ఇందులో 10 శాతం కూడా ఖర్చు అవ్వదు. కానీ దీన్ని పట్టించుకోకుండా వందలాది కిలోమీటర్ల నుంచి నీటిని తీసుకొచ్చి ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు.  హిమాయత్ సాగర్, ఉస్మాన్​ సాగర్​ నుంచి ఏదో నామమాత్రంగా సరఫరా చేస్తున్నారు.

ప్రభుత్వం కావాలనే చేసింది
111 జీవో ఎత్తి వేసేందుకే ఈ జలాశయాల నీటిని వినియోగించడంలేదు. ఈ జలాశయాల వల్ల ఉపయోగం లేదని చూపేందుకే కావాలని ఇట్లా చేసింది. ఈ నిర్ణయం వల్ల పలు ప్రాంతాలు వరదల ముంపుకు గురయ్యే ప్రమాదముంది. ‌‌- అల్లోల ఇంద్రాసేనారెడ్డి, బీజేపీ నగర కార్యవర్గ సభ్యులు

వీటి పనిలేదని చూపడానికే..
ఖర్చులేకుండా తక్కువలో సరఫరా చేసే నీటిని వదిలిపెట్టి దూర ప్రాంతాల నుంచి నీటిని ఎందుకు తెస్తున్నారో అర్థం కావడంలేదు. హిమాయత్ సాగర్, ఉస్మాన్​సాగర్ జలాశయాల అవసరం లేదని చూపించడానికే ఇలా చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఉస్మాన్​సాగర్​లోకి ఇప్పటికే మురుగునీరు చేరుతున్నది. అది బయటకు కనిపిస్తుందని కూడా ఈ నీటిని వాడటం లేదని అర్థమవుతున్నది.  ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసిన కూడా 111 జీవో ఎత్తివేయడం సాధ్యం కాదు. -దొంతి నర్సింహారెడ్డి, పర్యావరణవేత్త

ఎందుకు వాడలే?
జంట జలాశయాలను నిర్మించిందే వరద నివారణ కోసం. 1908 లో వచ్చిన వరదలతో భవిష్యత్​లో ఇబ్బందులు ఉండకుండా, అప్పట్లో  ఇంజనీర్​ విశ్వే శ్వరయ్య ఆలోచనల మేరకు వీటిని నిర్మించారు. వరదలు రాకుండా నీటి లెవల్స్​మెయింటెన్​ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికే జలాశయాలు ఫుల్​గా ఉన్నాయి. ఇక్కడ అందుబాటులో ఉన్న నీటిని వదిలిపెట్టి దూర ప్రాంతాల నుంచి కృష్ణ, గోదావరి జలాలను ఎందుకు తరలిస్తున్నారు? - ప్రొఫెసర్  కె.పురుషోత్తంరెడ్డి, పర్యావరణవేత్త