సొంత పార్టీ వాళ్లే..  నాపై దుష్ప్రచారం చేస్తున్నరు:పొన్నం

సొంత పార్టీ వాళ్లే..  నాపై దుష్ప్రచారం చేస్తున్నరు:పొన్నం

హైదరాబాద్, వెలుగు: తమ పార్టీలోనే కొందరు రాజకీయ ప్రత్యర్థులు కుట్రతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్​ సీనియర్​ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ మండిపడ్డారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తూ తనకు ఏ కమిటీలోనూ చోటు కల్పించకుండా అడ్డుకుంటున్నారని, పార్టీ మారుతున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని బుధవారం ఓ ప్రటకనలో తెలిపారు. దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. పార్టీ బలోపేతం కోసం తాను నిత్యం శ్రమిస్తూనే ఉన్నానన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవినీతిని ఎప్పటికప్పుడు నిలదీస్తూ ప్రజల తరఫున గొంతుకగా నిలుస్తున్నానని చెప్పారు.

‘‘సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను అంచెలంచెలుగా పార్టీలో ఎదిగాను. ఎన్​ఎస్​యూఐ కాలేజీ అధ్యక్షుడి నుంచి.. ఉమ్మడి ఏపీ ఎన్​ఎస్​యూఐ అధ్యక్షుడిగా, యూత్​ కాంగ్రెస్​ అధ్యక్షుడిగా, పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా ఎన్నో సేవలందించా. దాదాపు 35 ఏండ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా. ఎంపీగా ప్రత్యేక రాష్ట్రం కోసం పార్లమెంట్​లో పోరాడాను. పాలకులు ఎన్నో అవమానాలకు గురిచేసినా ఓర్చుకున్నాను. ఆంధ్ర నేతలు పెప్పర్​ స్ప్రేతో దాడి చేస్తే చావు అంచులా దాకా వెళ్లొచ్చినా.. అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమకారుడిని’’ అని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్​ పార్టీలోనే క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తానని పొన్నం స్పష్టం చేశారు. ఈ నెల 30న కొల్లాపూర్​లో జరిగే ప్రియాంకా గాంధీ సభలో కాంగ్రెస్​ కార్యకర్తగా పాల్గొంటానని తెలిపారు.