తిరుపతిలో శానిటైజర్ తాగి నలుగురు మృతి

తిరుపతిలో శానిటైజర్ తాగి నలుగురు మృతి

తిరుపతిలో శానిటైజర్ తాగి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శుక్రవారం నాడు తిరుపతిలోని స్కావెంజర్స్ కాలనీలో జరిగింది. మృతులను స్కావెంజర్స్ కాలనీకి చెందిన కుమారస్వామి (30), మున్సిపాలిటీలో పని చేసే వీరయ్య (50), వెంకట రత్నం,  శ్రీనివాసులుగా గుర్తించినట్లు తెలిపారు పోలీసులు. మద్యానికి బానిస అయిన ఈ నలుగురు శుక్రవారం ఉదయం శానిటైజర్ తాగారు. దీంతో ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించింది. రుయా ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ నలుగురూ మరణించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇటీవల ఏపీలోని వేర్వేరు జిల్లాల్లో ఈ తరహా ఘటనలు జరిగాయి. మద్యం బదులు శానిటైజర్ తాగి ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో పలువురు మరణించారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా శానిటైజర్ అమ్మకాలు, బెల్టు షాపులు, నాటు సారా తయారీ కేంద్రాలపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న 345 ప్రాంతాలను గుర్తించారు. శానిటైజర్లు తాగుతున్న144 మందిని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. శానిటైజర్ తయారీ కేంద్రాల లైసెన్స్ లను పరిశీలించి హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా శానిటైజర్లను తయారు చేస్తున్న 76 మందిపై ఎస్‌ఈబీ అధికారులు కేసులు నమోదు చేశారు.