8వ తేదీలోపు అందరికీ రైతు బంధు : 9న చర్చకు కేసీఆర్ సిద్ధమా : సీఎం రేవంత్ రెడ్డి

8వ తేదీలోపు అందరికీ రైతు బంధు : 9న చర్చకు కేసీఆర్ సిద్ధమా : సీఎం రేవంత్ రెడ్డి
  •  మిగిలింది 4 లక్షల మందికే వారి ఖాతాల్లోనూ వేస్తం
  •  కేసీఆర్.. 9 నాడు అమరవీరుల స్థూపం దగ్గరికి రా
  • ఏ ఒక్క రైతుకు బకాయి ఉన్నా ముక్కు నేలకు రాస్త లేకుంటే నువ్వు రాయాలె
  • సన్నాసి, దద్దమ్మ, దిక్కుమాలినోడా మతి ఉండి మాట్లాడుతున్నవా.. మందేసి మాట్లాడుతున్నవా
  • నువ్ 7 లక్షల కోట్ల అప్పులు చేసి పోతె.. మా భట్టి గట్టోడు కాబట్టి మొదటి తారీఖునే జీతాలిస్తుండు
  •  పంద్రాగస్టులోపు రుణమాఫీ అమలు చేసి హరీశ్ రావును సిద్దిపేటలో పాతరేస్తం
  • రాజ్యాంగాన్ని మారుస్తమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్ నిన్న ఇంటర్వ్యూలో చెప్పిండు
  • ఇప్పుడు చెప్పుండ్రి గుండు, అరగుండు, కిషన్ రెడ్డి ఎవరిని చెప్పుతోటి కొట్టాల్నో..?
  • బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లు రద్దవుతాయ్.. కాంగ్రెస్ గెలిస్తే రిజర్వేషన్లు ఉంటయ్
  • ఇది గుజరాత్ టీం వర్సెస్ తెలంగాణ టీం మధ్య పోరాటం
  • కొత్తగూడెం జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్/కొత్తగూడెం: ఈ నెల 8వ తేదీ నాటికి రైతుభరోసా పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మొత్తం 69 మంది లక్షల రైతుల్లో ఇప్పటి వరకు 65 లక్షల మంది ఖాతాల్లో పంటసాయం డబ్బులు జమ చేశామని, నాలుగు లక్షల మందికీ ఈ నెల 8 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఇవాళ కొత్తగూడెంలో జరిగిన జనజాతర సభలో సీఎం మాట్లాడారు. 9వ తేదీనాడు కేసీఆర్ అమరవీరుల స్థూపం వద్దకు రావాలని, బకాయి ఉంటే తాను ముక్కు నేలకు రాస్తానని, లేకుంటే కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. 

సీఎం రేవంత్ కేసీఆర్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ సన్నాసి, దద్దమ్మ, దిక్కుమాలినోడా మతి ఉండి మాట్లాడుతున్నవా.. మందేసి మాట్లాడుతున్నవా.. నువ్ 7 లక్షల కోట్ల అప్పులు చేసి పోతె.. మా భట్టి గట్టోడు కాబట్టి ప్రతి నెలా మొదటి తారీఖునే జీతాలిస్తుండు. నువ్వు చేసిన అప్పులకు కిస్తీలు, వడ్డీలు కడ్తుండు.. అప్పులు పాల చేసిన నువ్వు రైతుబంధురాలేదని ప్రశ్నిస్తవా..? సిద్దిపేట శనీశ్వర్ రావు రాజీనామా పత్రం జేబులు పెట్టుకోని తిరుగుతుండు.. దూలమోలె పెరిగిండు కానీ దూడకు ఉన్నంత బుద్దిలేదు.. హరీశ్ రావుకు సవాలు విసురుతున్నా.. పంద్రాగస్టు లోపు భద్రాచలం రాముల వారీ సాక్షిగా రైతు రుణమాఫీ చేసి.. ఆ తర్వాత శనీశ్వర్ రావును సిద్దపేటలోనే పాతరేస్తం. పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేసే బాధ్యత నాది, భట్టిది, లేకుంటే తుమ్మలది.. తుమ్మల కంటే వ్యవసాయం ఎవరికి తెలుసు ఆయన గెలిస్తే ప్రజల మధ్య ఉంటరు.. లేకుంటే లుంగీ కట్టుకొని వ్యవసాయం చేసుకుంటరు.  9వ తేదీలోపు ఆసరా పింఛన్లు పడుతయ్.’అని రేవంత్ రెడ్డి అన్నారు. 

ఎవర్ని చెప్పుతో కొట్టాలె..?

బీజేపీ లీడర్లపైనా సీఎం  రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు గుజరాత్ టీం.. వర్సెస్ తెలంగాణ టీం అని అన్నారు. గుజరాత్ టీంకు మోదీ నాయకుడైతే తెలంగాణకు రాహుల్ గాంధీ లీడర్ అని చెప్పారు. రేవంత్ మాట్లాడుతూ..‘బీజేపి కిషన్ రెడ్డి అంటుండు.. రాజ్యాంగాన్ని మారుస్తమని ఎవరన్న అంటే వాణ్ని చెప్పుతో కొట్టాలని.. నిన్న బీజేపీ జాతీయ  ప్రధాన కార్యదర్శి దుశ్యంత్ కుమార్ గౌతమ్ ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  రాజ్యాంగంలోని ప్రియంబుల్ మారుస్తమని చెప్పిండు.. ఇయ్యాల పత్రికల్లో వార్త వచ్చింది.. ఇప్పుడు చెప్పుండ్రి ఎవరిని చెప్పుతో కొట్టాల్నో.. గుండు, అరగుండును, అపర మేధావి కిషన్  రెడ్డిని నేను అడుగుతున్న.. అబద్ధాలు చెప్పినందుకు మిమ్మల్ని కొట్టాలా? రాజ్యాంగం మారుస్తమన్న వాడిని కొట్టాలా..? నేను అడుగుతున్న.. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లపై పోటు.. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు మీరంతా అండగా నిలవాలె.  

తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమేనని అన్నారు. సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.