కరుడుగట్టిన గంజాయి వ్యాపారి అరెస్ట్.. ఖమ్మం యూనిట్ ఈగల్ అధికారుల అదుపులో నిందితుడు

కరుడుగట్టిన గంజాయి వ్యాపారి అరెస్ట్.. ఖమ్మం యూనిట్ ఈగల్ అధికారుల అదుపులో నిందితుడు

పాల్వంచ, వెలుగు: దశాబ్దకాలంగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి వ్యాపారస్తుడిని ఎలైట్  యాక్షన్  గ్రూప్  ఫర్  డ్రగ్  లా ఎన్​ఫోర్షమెంట్(ఈగల్) ఖమ్మం యూనిట్  అధికారులు సోమవారం పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

గత కొన్నేండ్లుగా పోలీసులకు దొరకకుండా వ్యాపారం నిర్వహిస్తున్న ఒడిశా రాష్ట్రం మల్కాన్ గిరి జిల్లా కలిమెల రస్పెడ గ్రామానికి చెందిన సురేంద్రకేముడు అలియాస్  దేబ్​దాస్  అలియాస్  సురేందర్  అలియాస్ వివేక్  ఒడిశా, తెలంగాణ ప్రాంతాలకు గంజాయి తరలిస్తూ అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.

2016లో భద్రాచలం పోలీస్ స్టేషన్  పరిధిలో 22 కిలోలు, 2018లో హైదరాబాద్  తుకారాం గేట్  పీఎస్  పరిధిలో 20 కిలోలు, ఒడిశా రాష్ట్రం చిత్రకొండ పోలీస్ స్టేషన్  పరిధిలో 2020లో 150 కిలోలు, 2024లో పాల్వంచ టౌన్  పోలీస్ స్టేషన్  పరిధిలో 10 కిలోలు, అదే ఏడాది భద్రాచలం టౌన్  స్టేషన్  పరిధిలో 20 కిలోలు, గత ఏడాది రామగుండం ఎన్టీపీసీలో 13 కిలోలు, భద్రాద్రికొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి స్టేషన్  పరిధిలో 30 కిలోలు, మణుగూరులో 20 కిలోల గంజాయి పట్టుబడింది.

ఈ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేంద్ర తప్పించుకొని తిరుగుతుండగా ఈగల్  టీమ్  పట్టుకొని మణుగూరు స్టేషన్ లో అప్పగించారు. 4వ తరగతి మాత్రమే చదివిన సురేంద్ర పలు రాష్ట్రాల్లో హై ప్రొఫైల్  మాదకద్రవ్యాల కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సురేంద్ర అరెస్ట్​తో గంజాయి రవాణాకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు.