అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రి కొత్తూగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ఉడుముల బండ అటవీ ప్రాంతంలో పోడు భూముల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గిరిజనులు, అటవీశాఖ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని తోపులాట జరిగింది. ఉడుముల బండ అటవీ ప్రాంతంలో 28 కుటుంబాలకు చెందిన గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిలో కొందరికి పట్టాలు మంజూరయ్యాయి. గిరిజనులు సాగు చేస్తున్న భూమితో పాటు మరింత భూభాగంలో ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో దమ్మపేట రేంజర్ శ్రీనివాసరావు, సిబ్బందితో కలిసి జేసీబీ ద్వారా ప్లాంటేషన్ పనులు చేపట్టగా, విషయం తెలుసుకున్న గిరిజనులు పనులను అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తోపులాటలో ముగ్గురు గిరిజనులకు గాయాలు కాగా, వారిని అశ్వారావుపేటలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము పోడు సాగు చేస్తూ జీవిస్తున్నామని, పట్టాలు ఇవ్వాల్సిన అధికారులు భూములను లాక్కోవాలని చూస్తున్నారని గిరిజనులు ఆరోపించారు. రేంజర్ శ్రీనివాసరావు స్పందిస్తూ, కొద్దిమందికే పట్టాలు ఉన్నాయని, రోజురోజుకు అడవిని మరింతగా నరికేస్తున్నారని తెలిపారు. ప్లాంటేషన్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు ప్రారంభించామని, గిరిజనులతో చర్చించి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
