పంచాయతీ కార్యదర్శులకు ప్రోగ్రెస్‌‌ కార్డు

పంచాయతీ కార్యదర్శులకు ప్రోగ్రెస్‌‌ కార్డు
  •  32 పనులకు గరిష్టంగా 100 మార్కులు
  •  కనీసం 60 శాతం స్కోర్ చేయాల్సిందే
  •  కానీ 40 శాతం కూడా సాధించని జూనియర్లు
  • ‘జీరో పర్సంటేజీ’ పర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌ గ్రామాలూ ఎక్కువే
  • పనిలో ప్రోగ్రెస్‌‌‌‌‌‌‌‌ లేకుంటే షోకాజ్‌‌‌‌‌‌‌‌.. తర్వాత సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగుపంచాయతీ కార్యదర్శుల పనితీరును రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు లెక్కగడుతోంది. వారి పర్ఫార్మెన్స్​కు మార్కులేస్తోంది. కార్యదర్శులు ప్రతి నెలా సాధించాల్సిన సగటు అర్హత మార్కులను పేర్కొంటూ.. 32 అంశాల్లో పనితీరు  ఆధారంగా ప్రతి కార్యదర్శిని అసెస్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో జాయిన్ అయిన జూనియర్‌‌‌‌‌‌‌‌ పంచాయతీ కార్యదర్శులు డ్యూటీ సరిగ్గా చేస్తేనే ఉద్యోగం రైగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌ చేస్తామని, లేదంటే ఇంటికి పంపిస్తామని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక పనితీరు బాగాలేదని, హరితహారంలో వెనుకబడ్డారని ఇటీవల పలువురు కార్యదర్శులపై కలెక్టర్లు సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌ వేటు వేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శుల పర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌పై అధికారులు ఇస్తున్న మార్కులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఎలా లెక్క కడతారంటే..

కార్యదర్శులు గ్రామాల్లో 32 రకాల పనులను రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా నిర్వహిస్తూ, డేటాను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. రోడ్లు, రహదారుల శుభ్రత, పారిశుధ్యం, డంపింగ్‌‌‌‌‌‌‌‌ యార్డుల నిర్వహణ, స్ట్రీట్‌‌‌‌‌‌‌‌ లైట్ల ఏర్పాటు, మొక్కలు నాటడం, సంరక్షణ, గ్రామసభల నిర్వహణ, పన్నుల వసూలు, గ్రామ పంచాయతీ సమావేశాలు, లేఅవుట్‌‌‌‌‌‌‌‌, భవన నిర్మాణ అనుమతులు, వాణిజ్య, దుకాణ సముదాయాల లైసెన్స్‌‌‌‌‌‌‌‌, వేలం, ఈ–పంచాయతీ, జనన, మరణాల నమోదు, ధ్రువీకరణ పత్రాల జారీ, పంచాయతీ అభివృద్ధి ప్రణాళికను రూపొందించడం వంటి పనులు ఇందులో ఉన్నాయి. వీటి విషయంలో నెల రోజుల్లో కనబర్చిన పనితీరుకు సంబంధించిన నివేదికను పంచాయతీ కార్యదర్శులు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో పొందుపరుస్తున్నారు. 32 పనుల్లో చేసిన దాన్ని బట్టి గరిష్టంగా 100 మార్కులు వస్తాయి.

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో రిపోర్ట్‌‌‌‌‌‌‌‌..

రాష్ట్రవ్యాప్తంగా 12,753 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో సుమారు 1,100 పంచాయతీలకు మినహా మిగతా గ్రామాల్లో జూనియర్‌‌‌‌‌‌‌‌ కార్యదర్శులతోపాటు, గ్రేడ్‌‌‌‌‌‌‌‌ 1, 2, 3 పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పంచాయతీల్లో కార్యదర్శుల పర్ఫార్మెన్స్​ను 0 శాతం నుంచి 100 శాతం వరకు పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌ శాఖ లెక్కగట్టింది. వీటిలో జీరో పర్సంటేజీ పర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌ పొందిన గ్రామాలు కూడా ఉండడం పంచాయతీల పాలనకు అద్దం పడుతోంది.

జిల్లాలవారీగా వచ్చిన మార్కులిలా..

ఒక్కో కార్యదర్శి 32 అంశాల్లో చేసే పనిని బట్టి గరిష్టంగా వంద మార్కులు ఇస్తారు. కనీసం 60 మార్కులు సాధించినా వారి పనితీరు మెరుగ్గా ఉన్నట్లు పరిగణిస్తారు. రాష్ట్రం యూనిట్‌‌‌‌‌‌‌‌గా చూసినప్పుడు జిల్లాకు వంద మార్కుల చొప్పున 32 జిల్లాలు (హైదరాబాద్​మినహా) 3,200 మార్కులు గరిష్టంగా పొందాలి. జిల్లాలు కూడా సగటున 60 నుంచి 65 శాతం అర్హత మార్కులు సాధిస్తే ఆయా జిల్లాల పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్లే లెక్క. ఈ మేరకు గత మూడు నెలల పర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ను పరిశీలిస్తే మెజార్టీ సంఖ్యలో కార్యదర్శులు వెనుకంజలో ఉన్నారు. జిల్లాల వారీగా చూసినా ఏ ఒక్క జిల్లా కూడా అర్హత మార్కులు సాధించకపోవడం గమనార్హం.

పనితీరు మారకుంటే వేటే

ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నెల వరకు రాష్ట్రంలో ఒక్కో పంచాయతీ కార్యదర్శికి మూడు, నాలుగు గ్రామాల బాధ్యతలు ఉండేవి. కానీ ఊరికో కార్యదర్శి ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 9,355 పంచాయతీ కార్యదర్శి పోస్టులను భర్తీ చేసింది. ఎంపికైన వారిలో సుమారు 1,100 మంది వరకు ఉద్యోగాల్లో చేరలేదని తెలిసింది. దాదాపు 11 వేల గ్రామాలకు కార్యదర్శులు పూర్తి స్థాయిలో ఉండటంతో ప్రభుత్వం వారు చేపట్టాల్సిన టార్గెట్లను పెంచింది. ప్రతినెలా వారి పనిలో ప్రోగ్రెస్‌‌‌‌‌‌‌‌ కనిపించకపోతే కలెక్టర్లు వారికి షోకాజ్‌‌‌‌‌‌‌‌ నోటీసులు జారీ చేస్తారు. అయినా మారకుంటే సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌ వేటు పడే అవకాశముంది. పంచాయతీల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, కంప్యూటర్లు కూడా అన్ని జీపీల్లో లేవని, అలాంటప్పుడు 32 రకాల పనులను ఎలా చేస్తామని కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి