న్యూక్లియర్ పవర్ వాడుకున్నంత సేపూ బాగానే ఉంటుంది. తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం రావచ్చు. కానీ, పొరబాటున ఎక్కడైనా ఏదైనా జరిగిందా… తరతరాలు అణు ధార్మికతకు గురవుతాయి. దాదాపు యాభై ఏళ్లుగా జర్మనీలో యాంటీ–న్యూక్లియర్ ఉద్యమాలు సాగుతున్నాయి. చెర్నోబిల్, ఫుకుషిమా ప్రమాదాల తర్వాత జర్మనీ కళ్లు తెరిచింది. 2022 నాటికి మొత్తం ప్లాంట్లను మూసేయాలని నిర్ణయించింది. న్యూక్లియర్ ఫ్యూయల్ చాలా ప్రమాదకరం. ప్లాంట్లలో వాడేసిన ఫ్యూయల్ రాడ్లను వదిలించుకోవడం చాలా శ్రమ. జర్మనీకి ఎదురవుతున్న బెడద ఇదే.
జర్మనీకి ప్రతి పాతిక ముప్పయ్యేళ్లకు ఒక బెడద వచ్చి పడుతుంది. రెండు జర్మనీలు ఏకమైన ముప్పయ్యేళ్లకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను మూసేయడం, అణు వేస్టేజీని పాతిపెట్టడం అనే కొత్త సమస్యలు ఎదురయ్యాయి. జర్మనీ గత ఇరవై ఏళ్లుగా న్యూక్లియర్ పవర్ నుంచి నెమ్మదిగా తప్పుకుంటోంది. 2000 సంవత్సరంలో మొత్తం కరెంటు ఉత్పత్తిలో న్యూక్ పవర్ వాటా 29.5 శాతం. 2016 నాటికి 13 శాతానికి తగ్గించేసుకుంది. మరో మూడేళ్లలో జీరో లెవెల్‌కి తీసుకురావాలన్నది జర్మనీ ప్రభుత్వ లక్ష్యం. పర్యావరణానికి హాని కలిగించని లో–కార్బన్ ఎకానమీ వైపు జర్మనీ చూస్తోంది. రెన్యూవబుల్ ఇంధన వనరులతో కరెంటు ఉత్పత్తి చేసే ప్రక్రియని లో–కార్బన్ ఎకానమీగా గుర్తిస్తారు. వీటివల్ల కార్బన్ డయాక్సైడ్ చాలా తక్కువగా విడుదలవుతుంది. ప్రధానంగా విండ్ పవర్, సోలార్ పవర్, హైడ్రో పవర్లతో కరెంటుని పుట్టించుకోవడం జరుగుతుంది.
1986లో రష్యాలోని చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రంలో జరిగిన పేలుడుతో ప్రపంచమంతా ఉలిక్కి పడింది. అప్పటివరకు న్యూక్లియర్ పవర్‌పై పెంచుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ప్రపంచ దేశాలు న్యూక్ పవర్‌కి ప్రత్యామ్నాయాలకోసం వెదుక్కున్నాయి. ఆ తర్వాత జపాన్‌లో జరిగిన ఫుకుషిమా ప్లాంట్ ప్రమాదంతో ప్రపంచం మరింత వణికిపోయింది. 2011 మార్చి 11న జపాన్‌లోని ఒకుమాలో భారీ భూకంపంతో అలలు 14 మీటర్ల ఎత్తుకి ఎగసిపడి సునామీ సంభవించింది. అక్కడి ఫుకుషిమా డయిచి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సునామీ దెబ్బకు ఘోరంగా దెబ్బతింది. చెర్నోబిల్ ప్రమాదం తర్వాత ఫుకుషిమానే చెప్పుకుంటారు. దీనిని ఇంటర్నేషనల్ న్యూక్లియర్ ఈవెంట్ స్కేల్‌పై లెవెల్–7 ప్రమాదంగా గుర్తించారు. సునామీ వల్ల ఫుకుషిమా ప్లాంట్‌లో పవర్ సప్లయి ఆగిపోయి, సకాలంలో కూలెంట్ అందకపోవడంతో మూడు ముఖ్యమైన అణు రియాక్టర్లు కేవలం 72 గంటల్లో కరిగిపోయాయి. కరెంటు ఉత్పత్తిలో అణు రియాక్టర్లలో పనిచేసే ఫ్యూయల్ రాడ్లు తట్టుకోలేనంత వేడిగా ఉంటాయట!
ఈ రెండు ప్రమాదాలతో జర్మనీలో అణు విద్యుత్కేంద్రాల్ని మూసేయాలన్న డిమాండ్ మరింత బలంగా మారింది. థర్మల్ విద్యుత్‌తో పోలిస్తే న్యూక్లియర్ పవర్ చాలా తక్కువ ఖర్చులో ఎక్కువ ఫలితాన్నిస్తుందని, కాలుష్యాన్ని విడుదల చేయదని చెబుతారు. అయితే, ఇది నెత్తిమీద కుంపటిలాంటిది. న్యూక్ పవర్ ప్లాంట్లలోని రియాక్టర్లలో ఉపయోగించే ఫ్యూయల్, వాటిద్వారా విడుదలయ్యే రేడియో యాక్టివ్ వేస్టేజ్ చాలా ప్రమాదకరమైనవి. సాధారణంగా ఫ్యాక్టరీల్లో వదిలేసినట్లుగా తూములద్వారాగానీ, లేదా బల్క్‌గా ఏదోక చోట డంప్ చేయడానికిగానీ వీల్లేదు. జర్మనీ న్యూక్ పవర్ ప్లాంట్లను మూసేయడం తేలికే. కానీ, కీలకమైనది ఈ వేస్టేజీ మేనేజ్మెంటే. గతంలో అణు వేస్టేజీని వదిలించుకోవడానికి ఏరియాల్ని గాలిస్తున్నప్పుడు లోకల్ జర్మన్లు అడ్డం పడ్డారు. 1980లో జర్మనీలో గ్రీన్ పార్టీ ఏర్పడడానికి మూలం యాంటీ–న్యూక్లియర్ మూమెంటే.
అక్కడి పాలిటిక్స్‌లో న్యూక్లియర్ వ్యతిరేకతకూడా ముఖ్యమైన అజెండాగా మారిపోయింది. అణు విద్యుత్‌పై జర్మన్లకు అవగాహన కల్పిస్తుంటారు. న్యూక్లియర్ టెక్నాలజీవల్ల ఎదురయ్యే రిస్క్‌లపై మెజారిటీ జర్మన్లు ఆందోళన పడుతున్నారు. వేస్టేజీని వదిలించుకోవడానికి చేసే ప్రయత్నాల్ని జనం అడ్డుకుంటున్నారు.
జర్మనీ ఒక్క దేశానికే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల సమస్య కాదు… స్విట్జర్లాండ్కూడా ఇదే ప్రాబ్లమ్‌తో ఉంది. అక్కడ వాడుకునే మొత్తం కరెంటులో 40 శాతం అణు విద్యుత్తే! వీటిని 2034 నాటికి మూసేయాలని టార్గెట్ పెట్టుకుంది.

