యుద్ధంతో ఏ దేశాలకు లాభం..? ఏ దేశాలకు నష్టం..?

యుద్ధంతో ఏ దేశాలకు లాభం..? ఏ దేశాలకు నష్టం..?
  • పెరిగిన రష్యా, అమెరికా, కెనడా, నార్వే ఆయిల్ రెవెన్యూ
  • గత నెల రోజుల్లో  సగటున రూ.47,500 కోట్ల అదనపు ఆదాయం
  • ఇండియా, యూరప్‌‌‌‌, సౌత్‌‌‌‌ కొరియా, జపాన్‌‌‌‌ కు షాక్‌‌
  • చైనాపై ప్రభావం తక్కువే..

న్యూఢిల్లీ: ఇరాన్‌‌‌‌–అమెరికా యుద్ధం మొదలై నెల రోజులవుతోంది. యుద్ధం వలన అన్ని దేశాలకు నష్టాలే మిగులుతాయని అనుకుంటే పొరపడినట్టే.  పెద్ద ఆర్థిక వ్యవస్థలలో అమెరికా, రష్యాలు లాభపడుతుండగా, ఇండియా, యూకే, యూరోపియన్ యూనియన్ (ఈయూ), సౌత్ కొరియా, జపాన్‌‌‌‌ తీవ్రంగా నష్టపోతున్నాయి. చైనాపై  యుద్ధ ప్రభావం తక్కువగా ఉంది  ఏయే దేశాలపై ప్రభావం ఎలా ఉందో చూద్దాం.   

లాభపడుతున్న దేశాలు..

  • ఇరాన్ యుద్ధం వల్ల ఎక్కువగా లాభపడుతోంది రష్యానే.   భారత్‌‌‌‌కు రష్యన్ ఆయిల్ అమ్మకాలు ఏకంగా  50శాతం పెరిగాయి. గత నెల రోజుల్లో అదనంగా 5 బిలియన్ డాలర్ల (రూ.47,500 కోట్ల) ఆదాయం సంపాదించిందని అంచనా. 
  • ఆయిల్ ధరలు పెరగడంతో యూరప్ దేశాలకు ప్రదాన సప్లయర్‌‌‌‌‌‌‌‌గా మారిన  నార్వే, పెద్ద మొత్తంలో సంపాదించింది. గత నెల రోజుల్లో 3–5 బిలియన్ డాలర్ల  అదనపు ఆదాయం పొందింది.  అంతేకాకుండా ఈ దేశ పెట్రోలియం సెక్టార్‌‌‌‌‌‌‌‌లోకి పెట్టుబడులు పెరిగాయి. యుద్ధం వలన ద్రవ్యోల్బణం కొంత పెరిగినా, ఎలక్ట్రిసిటీ సబ్సిడీ వలన ప్రజలపై ప్రభావం 
  • తక్కువగా ఉంది. 
  • నాల్గో అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తిదారు అయిన కెనడా ఆదాయం   కూడా ఇరాన్ యుద్ధం వలన పెరుగుతోంది. గత నెల రోజుల్లో 6 బిలియన్ డాలర్ల వరకు రెవెన్యూ పొందిందని అంచనా.  కానీ, రిఫైనింగ్ కెపాసిటీ తక్కువగా ఉండడంతో  పెట్రోల్‌‌‌‌, డీజిల్ ధరలు లోకల్‌‌‌‌గా పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. 
  • బ్రెంట్ ధర 110 డాలర్లకి చేరడంతో అమెరికన్‌‌‌‌ కంపెనీల ఆదాయం పెరుగుతోంది.    ఈ దేశం నుంచి యూరప్‌‌‌‌కు గ్యాస్ ఎగుమతులు పెరిగాయి. అమెరికా  నెట్ ఆయిల్ ఎక్స్‌‌‌‌పోర్టర్ కాబట్టి గ్లోబల్ ధరలు పెరిగినప్పుడు మొత్తం ఎకానమీకి కొంత ప్రయోజనం ఉంటుంది. ఈ దేశ  జీడీపీ వృద్ధి 0.33 శాతం మేర పెరుగుతుందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. కానీ, లోకల్‌‌‌‌గా పెట్రోల్‌‌‌‌ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం కూడా ఉందని తెలిపారు.  

నష్టపోతున్న దేశాలు..

  • ఎక్కువగా నష్టపోయే పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా టాప్‌‌లో ఉంది.  ఆయిల్ ధరలు బ్యారెల్‌‌‌‌కు 100 డాలర్లను దాటడంతో మన దిగుమతుల ఖర్చు భారీగా పెరిగింది.  బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌‌‌‌కు 10 డాలర్లు పెరిగితే ఇండియాకు అదనంగా 12–18 బిలియన్ డాలర్ల  ఖర్చు అవుతుంది.  కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (సీఏడీ) ప్రస్తుతం జీడీపీలో 1.3శాతం ఉండగా,  3 శాతం  వరకు పెరిగే అవకాశం ఉంది. డాలర్‌‌‌‌‌‌‌‌తో రూపాయి విలువ గత నెల రోజుల్లో 4 శాతం పడి 94.80 కి దిగజారింది. ఇది మరింత  పడే అవకాశం ఉంది.  ద్రవ్యోల్బణం 5 శాతానికి పెరుగుతుందని,  వినియోగం తగ్గి జీడీపీ వృద్ధి నెమ్మదిస్తుందని ఎనలిస్టులు చెబుతున్నారు.
  • యూరప్ (ఈయూ + యూకే) కూడా యుద్ధం వలన ఎక్కువగా నష్టపోతోంది. పెరిగిన గ్యాస్‌‌‌‌, ఆయిల్ ధరల కారణంగా జీడీపీ గ్రోత్ రేట్‌‌‌‌ 0.4–0.5 శాతం తగ్గుతుందని అంచనా. ద్రవ్యోల్బణం ఒక శాతం పెరిగే అవకాశం ఉంది. 
  • యుద్ధం వలన సౌత్ కొరియా కూడా తీవ్రంగా నష్టపోతోంది.  ఆయిల్ ధరలు 10 డాలర్లు పెరిగితే  ఏడాదికి  8–10 బిలియన్ అదనపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పెట్రోకెమికల్స్, షిప్పింగ్, స్టీల్, ఆటోమొబైల్ సెక్టార్లు భారీగా నష్టపోతున్నాయి.  శామ్‌‌‌‌సంగ్‌‌‌‌, హ్యుందాయ్‌‌‌‌, పోస్కోపై యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది.  ద్రవ్యోల్బణం పెరిగితే  బ్యాంక్ ఆఫ్ కొరియా వడ్డీ రేట్లు పెంచొచ్చు. 
  • ఆయిల్ ధరలు పెరగడంతో  జపాన్‌‌‌‌ ఆయిల్ దిగుమతుల బిల్లు ఏడాదికి అదనంగా 15–20 బిలియన్  డాలర్లు పెరగనుంది. ఎలక్ట్రిసిటీ,  గ్యాస్ ధరలు పెరగడం వల్ల ఫ్యాక్టరీలు, హౌస్‌‌‌‌హోల్డ్స్ భారీగా నష్టపోతున్నాయి. జపాన్ స్టాక్ మార్కెట్ (నిక్కీ 225) యుద్ధం మొదలైన తర్వాత 6–7శాతం తగ్గింది. జపనీస్ కరెన్సీ యెన్ డాలర్‌‌‌‌తో గత నెల రోజుల్లో 2.7 శాతం  క్షీణించి 160 కి చేరింది.  జీడీపీ వృద్ధి రేటు  0.6 శాతం తగ్గే అవకాశం ఉంది.
  • చైనా దిగుమతుల ఖర్చులు పెరిగినా రష్యా/ఇరాన్ నుంచి డిస్కౌంట్ ఆయిల్ దొరుకుతుండడంతో  నష్టం కొంత తక్కువగా ఉంటుంది. కానీ, ఆయిల్ ధరలు ఎక్కువ కాలం 100 డాలర్లపైన ఉంటే ఈ దేశ జీడీపీ వృద్ధి 0.4–0.8 శాతం తగ్గొచ్చు.